5 వ్యాధులకు ఒకటే విరుగుడు

10 Jul, 2014 23:30 IST|Sakshi
5 వ్యాధులకు ఒకటే విరుగుడు

* చిన్నారుల కోసం సరికొత్త టీకా
* ‘పెంటావాలెంట్’ వ్యాక్సిన్‌కు రూపకల్పన
* అక్టోబరు నుంచి అమలుకు ఆరోగ్యశాఖ కృషి

 రాయవరం : చిన్నారుల కోసం ఆరోగ్య శాఖ సరికొత్త వ్యాక్సిన్‌కు రూపకల్పన చేసింది. ఐదు వ్యాధులకు కలిపి ఒకటే టీకాను అక్టోబరు నుంచి ప్రవేశపెట్టనుంది. దీనిపేరు పెంటావాలెంట్ వ్యాక్సిన్. ఇప్పటికే వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిశుమరణాలను తగ్గించేందుకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్లు వచ్చే వరకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా ప్రణాళికాబద్ధంగా వివిధ రకాల టీకాలను అందజేస్తోంది. బీసీజీ, డీపీటీ, పల్స్‌పోలియో, విటమిన్ ‘ఏ’, హెపటైటిస్-బి, హెచ్ ఇన్‌ఫ్లుయంజాబి వంటి వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది చిన్నారులకు వేస్తున్నారు. వీటిని ఐదేళ్లు వచ్చేవరకు ప్రణాళికాబద్ధంగా తగిన మోతాదు ప్రకారం వేసేందుకు మాతాశిశు సంరక్షణ కార్డులు కూడా జారీ చేస్తున్నారు. ఇది కాకుండా తొమ్మిదో నెలలో మీజిల్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు.
 
ఏయే వ్యాధులకు ఏ టీకా అంటే
ఇప్పటి వరకు క్షయ వ్యాధికి బీసీజీ, కోరింతదగ్గు, ధనుర్వాతం, ఫెర్టిజిస్‌కు డీపీటీ, రేచీకటికి విటమిన్ ఏ, కామెర్లకు హెపటైటిస్-బి, మెదడువాపునకు హెచ్ ఇన్‌ఫ్లుయంజాబి, పొంగు, తట్టుకు మీజిల్స్ వ్యాక్సిన్లను వేస్తున్నారు. అయితే ఇన్ని రకాల వ్యాక్సిన్లు కాకుండా ఇప్పుడు ఐదు వ్యాధులకు కలిపి ఒకే వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యోచిస్తున్నారు.  
 
కొత్త వ్యాక్సిన్  ఈ వ్యాధుల నివారణకు..

ఇప్పటి వరకు మూడు వ్యాధులకు డీపీటీ ఇస్తున్నారు. ఈ మూడు వ్యాధులకు మరో రెండు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా సరికొత్త టీకాను రూపొందించారు. కోరింత దగ్గు, ధనుర్వాతం, ఫెర్టిజిస్, కామెర్లు, మెదడు వాపు సోకకుండా కొత్త వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. అంటే ఇప్పటివరకు ఇస్తున్న హెపటైటిస్-బి, హెచ్ ఇన్‌ఫ్లుయాంజాబి, డీపీటీ వ్యాక్సిన్లకు బదులుగా ఒకటే వ్యాక్సిన్ ‘పెంటావాలెంట్’ను ప్రవేశపెట్టనున్నారు.  కొత్త వ్యాక్సిన్‌ను బిడ్డ పుట్టిన నెలన్నరకు ఓ డోసు, రెండున్నర నెలలకు మరో మోతాదు, మూడున్నర నెలలకు మరో డోసును ఇస్తారు.   
 
టీకా వల్ల ప్రయోజనాలివి
వయసుకు తగిన బరువు లేకపోవడం, వాంతులు, విరేచనాలతో బాధపడడం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి ఈ వాక్సిన్ రక్షణగా నిలుస్తుంది. కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు బయట మందుల షాపుల్లో వాక్సిన్లు లభ్యమవుతున్నా ధర అధికంగా ఉంటుంది. శిశు మరణాలు తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ వాక్సిన్‌ను ప్రవేశపెడుతున్నట్టు సమాచారం.
 
79,777 మందికి వాక్సినేషన్
అక్టోబరు నుంచి కొత్తగా అందజేసే పెంటావాలెంట్ వాక్సిన్‌ను జిల్లాలో 79,777 మందికి అందజేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా. జిల్లాలో ఉన్న 119 పీహెచ్‌సీల పరిధిలోని 890 సబ్‌సెంటర్లలో చిన్నారులకు ఈ వ్యాధి నిరోధక టీకాను అందజేస్తారు.

>
మరిన్ని వార్తలు