పార్టీ ప్రక్షాళనపై రాజ్‌ఠాక్రే వెనకడుగు

10 Jul, 2014 23:29 IST|Sakshi

సాక్షి ముంబై: పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించిన ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రే వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పార్టీ స్థానిక నాయకత్వంలో మార్పులు చేయాలని రాజ్‌ఠాక్రే భావించారు. అయితే ప్రస్తుతం స్థానికంగా కీలక స్థానాల్లో ఉన్న నాయకులు, వారి మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, మారిస్తే పార్టీని వీడతామంటూ తెగేసి చెప్పడంతో రాజ్ కొంత వెనక్కు తగ్గినట్లు తెలిసింది. పైగా అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో ప్రస్తుతం రాజ్ నిమగ్నమైనట్లు కూడా చెప్పుకుంటున్నారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక శక్తిగా ఎదిగేందుకు పార్టీని బలోపేతం చేయాలని రాజ్ భావించారు. అందుకోసం పార్టీకి మంచి పట్టున్న నాసిక్ నుంచి ప్రక్షాళన మొదటు పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ ఎమ్మెన్నెస్‌కు 40 కార్పొరేటర్లు, మేయర్‌తోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది. పైగా పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో నాసిక్ నుంచే ప్రక్షాళన చేయాలని భావించిన రాజ్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

 రాజ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు స్థానిక నేత వసంత్ గీతేతోపాటు ఆయన మద్దతుదారులు శివసేన, బీజేపీలోకి వె ళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజ్ పార్టీ సీనియర్ నాయకులను రంగంలోకి దింపి గీతేను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి బుజ్జగింపులు పనిచేసినా స్థానిక నాయకత్వంలో ఎటువంటి మార్పులు చే యమనే హామీని రాజ్‌ఠాక్రే నుంచి వారు కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రక్షాళ నను దాదాపు రాజ్ పక్కనబెట్టేసినట్లేనని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు