చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

5 Aug, 2017 12:46 IST|Sakshi
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మదనపల్లి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారులోని ఈడిగపల్లి ఏతాలవంక వద‍్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు స్పెయిన్‌ దేశీయులు దుర‍్మరణం చెందారు. మృతులు స్పెయిన్‌ దేశానికి చెందినవారు. ట్రావెల్‌ టెంపోలో అనంతపురం జిల్లా పుట‍్టపర్తి నుంచి చిత్తూరువైపు వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స‍్థలంలో నలుగురు మృతిచెందగా ఆస‍్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

సమాచారం అందుకున‍్న పుంగనూరు, మదనపల్లి పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకున‍్నారు. గాయపడిన ఇద‍్దరు విదేశీ మహిళలను 108లో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ​ట్రావెల్‌ టెంపో నుజ్జునుజ్జు అయింది. స్పెయిన్‌ దేశానికి చెందిన వారు అనంతపురం జిల్లా బత్తులపల్లి వద‍్ద ఉన‍్న ఆర్‌డీటీ(రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు)లో పనిచేస్తున్నారు. వారు టెంపోలో పాండిచ్చేరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా మృతులు విన్సెంట్‌ పెరోజ్‌, ఫ్రాన్సికో పెడ్‌రోసా, జోసిఫా మెరాన్‌, నీపెస్‌ లోసా..గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. మరోవైపు ఈ  ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో  స్పెయిన్ దేశస్థులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. స్పెయిన్ దౌత్య కార్యాలయంతో సంప్రదించి మృతుల వివరాలు తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పెయిన్ దేశస్తులు మృతిచెందడంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి, డిఎస్పీ, వైద్యులను సంఘటనా స్థలానికి పంపారు. మదనపల్లె ఏరియా ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని, అవసరమైతే తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు గాని, బెంగళూరుకు గానీ క్షతగాత్రులను తరలించాలని సూచించారు. మృతదేహాలకు ఆలస్యం లేకుండా పోస్టుమార్టం నిర్వహించాలని డాక్టర్లకు కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు.


మరిన్ని వార్తలు