అందీ అందని ఆరోగ్యశ్రీ

3 Mar, 2019 08:47 IST|Sakshi

నగదు పరిమితి పెంచినా శస్త్ర చికిత్సల సంఖ్యపై ఆంక్షలు.. సొంత ఊరిలో రేషన్‌ తీసుకున్న వారికే వర్తించాలన్న నిబంధనలు.. హైదరాబాద్‌లో వైద్యానికి పథకం వర్తించని వైనం.. కీమోథెరపీల సంఖ్య 8 నుంచి 2కి కుదింపు.. కాంక్లియర్‌ ఇంప్లాంట్స్‌ ఆపరేషన్‌ నెలకు ఒకరికే.. ఇవీ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం విధించిన షరతులు. ఈ అరకొర సాయానికే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న వైనాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. 

శ్రీకాకుళం అర్బన్‌: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల గిమ్మిక్కులు చేస్తోంది. ఒకపక్క ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతున్నట్టు ప్రకటిస్తూనే.. అనేక నిబంధనలు పెట్టి పేదలకు అందకుండా చేస్తోంది. పరిమితి పెంచినా సర్జరీల సంఖ్యను పెంచకపోవడంతో ఎటువంటి ప్రయోజనం దక్కదని పెదవి విరుస్తున్నారు. పేదలకు ప్రమాదకర రోగం వస్తే చికిత్స చేయించుకునే తాహతులేక, ఆస్తులు అమ్ముకున్నా ఖరీదైన వైద్యం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలైన న్యూరోసర్జరీలు, యాక్సిడెంట్లలో తీవ్రంగా గాయపడిన వారికి అందించే ఐసీయూ చికిత్సలు, గుండెకు చేసే అధునాతన శస్త్రచికిత్సలను ఈ పథకం పరిధి లో చేర్చాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

అయితే దీని వలన పేద రోగులకు పెద్దగా ఉపయోగం లేదన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఖరీదైన వైద్యం పేదలకు అందివ్వాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. మొదట్లో 468 జబ్బులతో మొదలైన ఈ పథకంలో సంవత్సరం గడిచిన నాటికి 938 జబ్బులను చేర్చారు. పేదవారు చేయించుకోలేని గుండె జబ్బుల నుంచి కాలేయ జబ్బు వరకూ, క్యాన్స ర్‌ నుంచి ఏ జబ్బుకైనా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స చేసుకునేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. వ్యాధుల బారిన పడిన వారికి చికిత్సతోపాటు వైద్యం జరిగినన్ని రోజు లూ భోజనం, రవాణా చార్జీలను సైతం చెల్లిం చేలా పథకాన్ని రూపొందించారు. అప్పట్లో అనేకమంది దీని ద్వారా ప్రాణాలు కాపాడుకుని వైఎస్సార్‌కు తమ గుండెల్లో గుడికట్టారు. 

పేరు మార్పు.. తీరు మార్పు
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్‌టీఆర్‌ వైద్యసేవగా మార్చారు. ప్రస్తుతం 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు చేయకూడదని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స చేయాలని రాష్ట్రప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ఇటీవల కాలంలో మరలా 128 జబ్బులను చేర్చడం జరిగిందని ఎన్‌టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌ పి.ప్రకాశరావు చెప్పారు. హైదరాబాదు వంటి నగరాల్లో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యశ్రీ క్రింద నగదు విడుదల చేయడం లేదు. దీంతో అక్కడి వైద్యశాలలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులకు వైద్యచికిత్సలను అందించడం లేదు. అలాగే స్వంత ఊరిలో రేషన్‌ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిసుందని ప్రభుత్వం లింకు పెట్టింది. దీంతో పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని ఈ పథకం కింద వైద్య సదుపాయానికి అనర్హులను చేశారు. ఒకవేళ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పొందాలనుకుంటే విజయవాడలోని చీఫ్‌ మినిస్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ (సీఎంసీవో)కు ఫిర్యాదు చేసి అక్కడ నుంచి పర్మిషన్‌ తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. గతంలో సీఎంసీవో జిల్లాల వారీగా ఉండేది. ఇపుడు ఒక్క విజయవాడలో మాత్రమే ఉండడంతో చాలామంది నిరుపేదలు ఎన్‌టీఆర్‌ వైద్యసేవకు దూరం అవుతున్నారు. కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పథకం వలన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. క్యాన్సర్‌ వస్తే కనీసం 8సార్లు కిమోథెరపీ చేయించుకోవాలి.

అయితే ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వరకే తాము భరిస్తామని, తర్వాత ఎవరికి వారే చేయించుకోవాలనే నిబంధనను విధించడంతో క్యాన్సర్‌ రోగులు మృత్యువాత పడుతున్నారు. చెవుడు, మూగ వారికి కాంక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమర్చే సదుపాయాన్ని తీసుకువచ్చినప్పటికీ.. ఆసుపత్రులలో నెలకు ఒక కేసు మాత్రమే తీసుకోవాలనే నిబంధన విధించారు. ఇక నరాలు, కాలేయానికి సంబంధించిన శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యశాలలు ముందుకు రావడం లేదు. ఇలాంటి అనేక నిబంధనల వలన పేదవారు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా మెరుగైన వైద్య సేవలను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ )పథకానికి పరిమితి పెంచినప్పటికీ నిబంధనలు విధించడం వలన పేద రోగులకు ఒరిగిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు చాలా కాలం నుంచి వైద్యమిత్రలను నియమించడం లేదు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవకు సిబ్బంది కొరత వేధిస్తోంది. సిబ్బందిని పెంచి పథకం పరిధిని విస్కృతపరిస్తేనే పేద రోగులకు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు