పెందుర్తి రెవెన్యూలో అవినీతి చేప

7 Nov, 2014 02:10 IST|Sakshi
పెందుర్తి రెవెన్యూలో అవినీతి చేప

పెందుర్తి : పెందుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డాడు. ఎఫ్ లైన్ ధ్రువపత్రం కోసం రూ.5 లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ పొడుగు రవ్రీంద్రపాల్ గురువారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.నరసింహారావు తెలిపిన వివరాలు.. పెందుర్తి గ్రామానికి చెందిన మామిడి సింహాచలంకి పెందుర్తి సమీపంలో కొత్తవలస వెళ్లే రహదారి వద్ద 79 సెంట్ల భూమి ఉంది. సింహాచలం ఈ ఏడాది జూన్‌లో మరణించాడు.

దీంతో అతడి పేరిట ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాన్ని సింహాచలం భార్య వెంకటేశ్వరమ్మ పేరిట మా ర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ తరపున ఆమె మనవడు సింహా చలం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న యడ్ల రామారావు గత ఆగస్టు 30న ఎఫ్ లైన్ సర్టిఫికెట్ కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం సర్వేయర్ భూమిని సర్వే చేసి రిపోర్టు ఇస్తే 45 రోజులకు ఎఫ్ లైన్ ధ్రువపత్రం వస్తోంది. అయితే సర్వేయర్ రిపోర్టు కోసం రూ.10 వేలు డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇస్తానని రామారావు సర్వేయర్‌ను ఒప్పించాడు.

నగదు ఇచ్చేందుకు సిద్ధమైన రామారావు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం గురువారం పాల్‌కు లంచం ఇచ్చేందుకు వెళ్లగా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి అతడిని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో రవీంద్రపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ రూర ల్ డీఎస్పీ ఎన్.రమేష్, ఇన్‌స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు