అది..తీరని వేదన

27 Sep, 2015 03:19 IST|Sakshi
అది..తీరని వేదన

‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు భోగవంతుని విచలింపచేయగలదు.. భగవంతునికి నివేదించుకొనగలదు.. అదితీ..ఏమయిపోయావమ్మా..ఎక్కడున్నావు చిట్టి తల్లీ.. నీవు కనిపించక రెండు రోజులు దాటిపోయింది. నీవు లేకుండానే ఇంట్లో నిద్రలేని మూడు రాత్రులు గడిచిపోయాయి. రెప్పలు మూతపడటం లేదమ్మా..మానసికంగా అలసిపోయా..దిగులుతో కుంగిపోయా..కళ్లు నీళ్లింకిన బావులయ్యాయి. గుండెలు పిండేస్తున్నాయి.. నీ చిరు నవ్వులు. ముద్దు మాటల మూటలు క్షణం కూడా వీడకుండా వెంటాడుతున్నాయి.
 లేలేత పాదాలతో నీవేసిన చివరి అడుగు మురికి కూపంలో పడిందమ్మా..ఆ క్షణం నీవనుభవించిన బాధ గుండెల్ని మెలిపెడుతోంది.. నీకోసం వెతకని చోటులేదు..చిన్న కాలువ నుంచి పెద్ద గెడ్డల వరకూ అనువణువూ గాలించాం..చీకట్లు ముసురుకున్నా గాలింపు ఆపలేదమ్మా..కనిపించిన దారంతా కళ్లు చేసుకుని వెతికాం..అయినా నీ జాడలేదమ్మా..
 
విమానాలు కూలిపోతే సప్త సముద్రాలూ మధించి శకలాలేకాదు..బ్లాక్‌బాక్స్‌నూ వెలికి తీయగల సాంకేతిక సంపత్తి సొంతం చేసుకున్నాం. ప్రపంచాన్నే అరచేతిలో బంధించామంటూ గర్వపడుతున్నాం. గూగుల్‌తో సర్వాన్నీ చిటికెలో శోధిస్తున్నాం..సాధిస్తున్నాం.. కానీ ఏం ప్రయోజనం.. కాల్వలో పడి కళ్లముందే కొట్టుకుపోయిన నిన్ను రక్షించుకోలేకపోవడం ఎంతటి ఘోరవైఫల్యం.. మురికి కాలువలు కలిసే సాగరం చెంత హెలికాప్టరు గాలించి నిట్టూరిస్తూ వెనుతిరిగింది. 15మంది గజ ఈతగాళ్ల శ్రమా నిష్ఫలమైంది..250మంది నాలుగు పొక్లయిన్లతో చేసిన భారీ అన్వేషణా ముగిసిపోయింది. నీ జాడ గుర్తించలేకపోయింది....కానీ ఓడిపోయామని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని మా గుండెలు పదే పదే ఓ కవి హృదయ ఘోష రూపంలో ఆర్తిగా ఇలా పలవరిస్తున్నాయి...

‘ఒక తల్లి నీరవాక్రోశ రవమ్ము విన్నంతవరకూ
ఒక క్షత దుఃఖిత హృదయమూరడిల్లనంతవరకూ
నాకు శాంతికలగదింక నేస్తం..ఈ సిగ్గులేని
ముఖాన్ని చూపించలేను.
చిన్నమ్మా..వీళ్ల మీద కోపగించకు..
వీళ్లనసహ్యించుకోకు...   

 
అదితి ఆచూకీ ప్రశ్నార్థకం
- మూడురోజులవుతున్నా లభించని అదితి జాడ
- తీవ్రతరమైన గాలింపు చర్యలు
- వాసుపాలెంలో కంట్రోలు రూం

అదితి జాడ ఎక్కడ. రోజులు గడుస్తున్నాయి. కాలం కరిగిపోతోంది. వందల మంది సిబ్బంది. డ్రైనేజీ,గెడ్డలు జల్లెడ పడుతున్నా అదితి ఆచూకీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మద్దిలపాలెంలోని డ్రైనేజీలో పడిగల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి కోసం గాలింపు ముమ్మరం చేశారు. జీవీఎంసీ, పోలీస్, అగ్నిమాపక, నేవీ, మత్స్యకారులు, డ్రైనేజీకి ఆనుకుని ఉన్న నివాస ప్రజలు వెతుకుతున్నా జాడ కనిపించడం లేదు.
 
ఎవరీ అదితి..
బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చే స్తున్న చాడ శ్రీనివాస్, రేవతిల గారలపట్టి అదితి. ఇద్దరు మగపిల్లల సంతానం తర్వాత పుట్టిందీ సాయి లావణ్య అదితి(6). అదితి అంటే దేవత. ఈ చిన్నారి తల్లిదండ్రులు బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నందున సీతమ్మధారలోని తాతయ్య వద్ద ఉంటుంది. టింపనీ స్కూల్లో ఒకటో తర గతి చదువుతూ మద్దిలపాలెం కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్ లోని ఐఒసి ఇనిస్టిట్యూట్‌లో ట్యూషన్ చదువుతుంది.
 
సిమెంట్ పలకలు వల్లే ప్రమాదం...
అదితి జారిపడిన డ్రైనేజీ వంద మీటర్ల మేర సిమెంట్ పలకలు ఉన్నందున ఆచూకి తెలియలేదు.  డ్రైనేజీ వంద మీటర్ల తర్వాత ఉన్న భానునగర్ గెడ్డకు అనుసంధానమవువుంది. ఈ గెడ్డ ఎంవీపీకాలనీ, లాసన్స్‌బేకాలనీ మీదుగా వాసవానిపాలెం తీర సముద్రంలో కలుస్తుంది. ఘటన స్థలం నుంచి మూడు కిలో మీటర్లు పొడవునా ఈ గెడ్డ ప్రవహిస్తోంది. జీవీఎంసి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఈ గెడ్డ వెంబడి సముద్రం వరకు గాలించిన అదితి ఆచూకి ఎక్కడ లభ్యం కాలేదు. గెడ్డ ఒంపుల వద్ద పూడిక పోయిన పూడికలు,రాళ్లను నాలుగు జేసీబీలతో తొలిగించినా జాడ కనించలేదు.
 
వాసువానిపాలెంలో కంట్రోలు రూం..
శనివారం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. భానునగర్ నుంచి వాసవానిపాలెం సముద్రం వరకు విసృ్తతంగా గాలించారు. ప్రతీ వంద మీటర్లకు అయిదుగుర్ని పెట్టి ఆయా ప్రాంతంలో అణువణువు పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ వాసువానిపాలెం తీరాన్ని సందర్శించారు. రెండున్నర కిలోమీటర్ల మేర 150 మందిజీవీఎంసీ సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. వాసువానిపాలెంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనరు చెప్పారు. ఏ సమాచారం తెలిసినా ఇక్కడకు తెలియజేయాలన్నారు.  సముద్రంలో పది బోట్లు ద్వారా గాలించారు. రిషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు మత్స్యకారులను కాలినడకన వెతకాలని కోరారు. నేవీ హెలికాఫ్టర్ ద్వారా సముద్రంలో గాలించారు. మరోపక్క గజ ఈతగాళ్లు తమ పని కొనసాగిస్తున్నారు.
 
ఆచూకీ తెలిపితే రూ.50వేలు
అదితి బీచ్‌లోకి వెళ్లుంటే 48 గంటల్లో తేలితుందని మత్స్యకారులు జీవీఎంసీ కమిషనర్‌కు వివరించారు. ఆతర్వాత ఆచూకీ లభ్యం కాకపోతో ఏం చేయాలనే విషయమై కమిషనర్ నేవీఅధికారులతో చర్చించారు. పాపపై ఇసుకమేటలు వేసుంటే కనిపించే అవకాశం లేదు కనుకభానునగ ర్ నుంచి గెడ్డలో మీటర్ లోతు వరకు జేసీబీలతో తవ్వించాలని ఆయన సూచించారు. అదితి ఆచూకి తెలిపిన వారికి రూ.50వేలు నగదు అందించే విధంగా ప్రకటిస్తామన్నారు. కమిషనరును అదితి తండ్రి శ్రీనివాసరావు..తాత కలిశారు. తమ బిడ్డ ఆచూకీ తెలిపేలా చర్యలుతీసుకోవాలని కోరారు.
 
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
జీవీఎంసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెన్షన్‌చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జోన్-2కు చెందిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ప్రమీలారాణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరరాఘవులను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. విధి నిర్వహణలో అలక్ష్యంగా ఉన్నందుకే ఈనిర్ణయం తీసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు