అందనంత దూరం అక్షర జ్ఞానం

14 Mar, 2019 10:55 IST|Sakshi

ప్రైవేట్‌ విద్యకు చంద్రబాబు ఊతమిచ్చారు

పేదలకు విద్య దూరమైంది.. నిరక్షరాస్యత పెరిగింది

‘సాక్షి’తో వయోజన విద్యాశాఖ రిటైర్డు జేడీ గోపాల్‌రెడ్డి 

సాక్షి, ఒంగోలు టౌన్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌గా 1973 నుంచి 1982 వరకు పనిచేసిన గోపాల్‌ రెడ్డి.. 1982–2006 వరకు వయోజన విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో సత్యమత్ర మెమోరియల్‌ లిటరసీ అవార్డును అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ రామకృష్ణతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి గోపాల్‌రెడ్డి అందుకున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రభుత్వ విద్య ఏవిధంగా నిర్వీర్యమైంది, జగన్‌ ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్‌ సంఖ్య ఎలా నిర్మూలన అవుతుందో ‘సాక్షి’కి వివరించారు.

క్వాలిటీ విద్యకు కేరాఫ్‌
‘గతంలో క్వాలిటీ విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్‌గా నిలిచేవి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పరిశోధన చక్కగా నిర్వహించేవారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా మంచి పట్టు వచ్చేది. టీచింగ్‌ నోట్స్‌ రాసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారని’ గోపాల్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూద్దామన్నా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయింది. దాంతో అనేక మంది ఉపాధ్యాయులు విద్యేతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చివరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేట్‌కు పెద్దపీట!
‘సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేట్‌ విద్యకు చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ విద్యను పరుగెత్తించారు. ఒక విద్యా సంస్థల అధినేతను తన క్యాబినెట్‌లో మంత్రిగా చేర్చుకున్నారంటే ప్రైవేట్‌ విద్యపట్ల చంద్రబాబుకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చని’ తాటిపర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖామంత్రిగా నారాయణ, ఆయన బంధువైన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ విద్యను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక పాఠశాలల్లో విద్యపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు అవసాన దశకు చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే ఉన్నత పాఠశాలలకు కూడా ఈ దుస్థితి పట్టే ప్రమాదం ఉంద’ని అన్నారు.

వయోజన విద్యకు గండి
‘జిల్లాలో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వయోజనుల్లో అక్షరాస్యత శాతం క్రమేణా పడిపోతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 74 శాతం చూపించగా, ప్రకాశం జిల్లాలో 63 శాతంగా ప్రకటించారు. వయోజన విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానిని కూకటివేళ్లతో పెకలించేసింది. రాష్ట్రంలో వయోజన విద్యకు సంబం«ధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియమితులైన 23 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం తొలగిండడం దారుణమైన చర్య. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారు నేర్చుకున్న చదువు మర్చిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సాక్షర భారత్‌ కేంద్రాలు కనుమరుగైపోయాయి.

‘అమ్మ ఒడి’ కొండంత అండ
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అమ్మ ఒడి పేదలకు అండగా ఉంటోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల చదువుకు భరోసా కలగనుంది. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం మంచి పరిణామమ’ని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత అమలుచేసే కార్యక్రమాల్లో అమ్మ ఒడిని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు