కొలతల్లో కనికట్టు..

30 Jan, 2014 23:50 IST|Sakshi
 సాక్షి, గుంటూరు :కొలతల్లో మస్కా కొడుతున్న పెట్రోలు బంకులు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. వీటిపై నిఘా పెట్టి కట్టడి చేయాల్సిన రెవెన్యూ, తూనికలు, కొలతలు, పౌర సరఫరాల శాఖలు కళ్లు మూసుకుంటున్నాయి. ఠంచనుగా మామూళ్లు చేతికందడంతో తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న పెట్రోలు బంకుల్లో కొంత నిరంతర నిఘా ఉంటుంది. వీఐపీ వాహనాలు తరచూ రాకపోకలు సాగిస్తుండటం, వినియోగదారులు ఎక్కువగా నమ్మకంతోనే పెట్రోలు కొట్టించుకోవడానికి ఈ బంకులకు వస్తుంటారు. దీంతో ఇక్కడ కల్తీలకు, ఇతర అవకతవకలకు ఆస్కారం అతి తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే బంకుల్లో కల్తీలు అధికంగా ఉంటున్నాయనేది అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లోనే తేలిన వాస్తవం. జిల్లాలో 220 పెట్రోలు బంకులు వున్నాయి. 
 
 రోజుకు 27 లక్షల లీటర్ల వినియోగం ఉంటుందని అంచనా. అయితే ఈ పెట్రోలు బంకుల్లో నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు నిఘా వేయాలి. నెలవారీ తనిఖీలు చేయాలి. అవేమీ పూర్తి స్థాయిలో జరగడం లేదు. కొన్ని చోట్ల రెవెన్యూ, పౌరసరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ల దృష్టికి తెచ్చినా తనిఖీలు నిర్వహించని పరిస్థితి నెలకొంది. ఈ శాఖల నడుమ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వాహన వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టే రీతిలో జరుగుతున్న దోపిడీపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేమిటంటే నెలవారీ మామూళ్లే కారణంగా కనిపిస్తున్నాయి. అడపా దడపా విజిలెన్స్ అధికారులు చేసే తనిఖీల్లో ఈ కేసుల్ని పౌరసరఫరాల శాఖకు బదిలీ చేస్తున్నారు. ఇవన్నీ జేసీ కోర్టులో విచారణ జరుగుతున్నాయి. 
 
 నిబంధనలు అతిక్రమిస్తున్న పెట్రోలు బంకులు.. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నా, రీడింగ్ నమోదులో చేతివాటం చూపుతున్నా, బంకుల నిర్వాహకుల ఆగడాలకు అడు ్డకట్ట వేయలేకపోతున్నారు. లెసైన్సులు రెన్యువల్ చేయించుకోకపోవడం, పెట్రోలు, డీజిల్‌లో కిరోసిన్ కల్తీ, ఫైళ్ళు సరిగా నిర్వహించకపోవడం, నిల్వలో వ్యత్యాసాలు, చమురులో నీటి కల్తీ, ధరల బోర్డులు లేకపోవడం, రిటర్న్స్ దాఖలు చేయకపోవడం, సరకుల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. తరచూ తనిఖీలు చేయకపోవడంతో అక్కడక్కడా వచ్చిన ఆరోపణలు, ఆర్డీవోలు, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడినవే కేసులుగా నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని పెట్రోలు బంకులపై ఆరోపణలు, ఫిర్యాదులు చుట్టుముట్టినా కనీసం పట్టించుకోవడం లేదు.
మరిన్ని వార్తలు