కరువు నేలకు జలాభిషేకం 

16 Sep, 2019 08:12 IST|Sakshi
నిండుకుండలా శ్రీశైలం జలాశయం

నిండుకుండలా జలాశయాలు

గలగల పారుతున్న కాలువలు 

శ్రీశైలం డ్యాంకు వెయ్యి టీఎంసీలకుపైగా చేరిక 

ఇప్పటి వరకు 83 టీఎంసీలు వినియోగం 

మరో 70 టీఎంసీల వినియోగానికి అవకాశం 

జిల్లాలో కళకళలాడుతున్న పైర్లు  

సాక్షి, కర్నూలు : ఆలస్యంగానైనా నైరుతి రుతు పవనాలు కరుణించాయి.. తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కరువు జిల్లా కర్నూలు జలాభిషేకంతో పులకించిపోతోంది. జలాశయాలన్నీ నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ప్రధాన కాలువలు గలగల పారుతూ.. పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. చాలా ఏళ్ల తరువాత తుంగభద్ర, కృష్ణా నదులకు రెండోసారి వరదలు వచ్చాయి. శ్రీశైలానికి సెప్టెంబరు నెలలోనే వెయ్యి టీఎంసీలకుపైగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం నిండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా 89.814 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు మినహా మిగిలినవన్నీ దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు ఎలాంటి ఢోకా లేనట్లేనని అధికార యాంత్రాంగం చెబుతోంది. శ్రీశైలానికి వరద కొనసాగుతుండడంతో మరో 70 టీఎంసీలకుపైగా నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది.  


రిజర్వాయర్ల నీటి మట్టాలు టీఎంసీల్లో ..

పుష్కలంగా నీరు.. 
జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు కాలువలకు నీటిని పుష్కలంగా వదులుతున్నారు. ఫలితంగా ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. కేసీ కాలువ కింద ఇప్పటికే వరి నారుమళ్లు వేసుకోగా..మరికొందరు నాట్లు పూర్తి చేసుకున్నారు.  తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 40కి పైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నదికి వరద కొనసాగుతుండడంతో ఆయా ప్రాంత రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెనక జలాల కింద ఏర్పాటు చేసిన పథకాలు, కుందూ నదిపై ఉన్న పథకాల ద్వారా పంటలకు సాగునీరు అందుతోంది.

ఆశాజనకంగా సాగు.. 
జలాశయాలకు సమృద్ధిగా నీరు రావడం, వర్షాలు ఆశించిన మేర కురవడంతో ఖరీఫ్‌ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో సాధారణ సాగు 6,09,916 హెక్టార్లుండగా ఇప్పటి వరకు 5,33,692 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు 2,40,212 హెక్టార్లు ఉండగా 2,63,595 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు 91190 హెక్టార్లుండగా 79,407 హెక్టార్లలో వేశారు.  కాల్వలకు నీరు విడుదల చేయడంతో  వరిసాగు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 38,814 హెక్టార్లలో వరిసాగైంది. మొక్కజొన్న 28,712, కంది 63,906, కొర్ర 6,455, సజ్జ 5,683, మినుము 1,953, ఆముదం 16,653, మిరప 10,882, ఉల్లి 13,235 హెక్టార్లలో సాగయ్యాయి. ఇంకా 71,260 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

 
పత్తికొండ మండలం దూదేకొండ గ్రామ సమీపంలో కళకళలాడుతున్న వేరుశనగ పైరు 

ఆయకట్టుకు ఇబ్బందులు ఉండబోవు 
కృష్ణా, తుంగభద్ర నదులకు మరోసారి వరద నీరు వస్తోంది. జిల్లాలోని రిజర్వాయర్లలో 90 శాతానికిపైగా నీరు నిల్వ ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహణపై కలెక్టర్‌తో చర్చించాలని సర్కిల్‌ ఎస్‌ఈకి సూచించాం. శ్రీశైలానికి వరద నీరు ఏ మేరకు వస్తుందో చూడాలి. ఆయకట్టుకు మాత్రం నీటి ఇబ్బందులు ఉండబోవు. వెలుగోడులో పూర్తి స్థాయి నీటి మట్టానికి నిల్వ చేస్తాం. గోరుకల్లులో 9 నుంచి 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
– నారాయణరెడ్డి, సీఈ జల వనరుల శాఖ 

మరిన్ని వార్తలు