‘ఆర్బీకే’లపై అవగాహన పెంచండి 

21 Jun, 2020 05:05 IST|Sakshi

అధికారులకు వ్యవసాయ మంత్రి ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేలు) అందిస్తున్న సేవలపై రైతులకు అవగాహన కల్పించాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆర్‌బీకేల పనితీరు, వ్యవసాయ యాంత్రీకరణపై శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేలు సమగ్ర వ్యవసాయ కేంద్రాలనే విషయం రైతులకు తెలియకపోతే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని, ఆర్బీకే నుంచి అందించే సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

► వ్యవసాయ ఉత్పాదకాల్ని మార్కెట్‌ ధర కన్నా తక్కువకు అందించాలి. నాణ్యతలో రాజీ వద్దు.  
► ఆర్బీకేల నుంచే పశుగ్రాసం, దాణా, మినిరల్‌ మిక్చర్, ఇతర సేవలు. ఆర్డర్‌ చేసిన 48 గంటల్లోగా సేవలందించేలా ఆయా కంపెనీలను సన్నద్ధం చేయాలి. 
► ఆగ్రోస్‌ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవసాయ అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకోవాలి.  
► యాంత్రీకరణపై మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగేలా చూడాలి. రైతులకు తక్కువ అద్దెకు యంత్రాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి.  
► కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై కసరత్తు జరగాలి 
► ఉద్యాన శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.  
► విత్తన సంస్థలు తమ సీడ్స్‌ను ఆర్‌బీకేల నుంచే విక్రయించేలా సంప్రదింపులు జరపాలి 
► సబ్సిడీపై 6.34 లక్షల క్వింటాళ్ల విత్తనాలను గ్రామాల్లోనే రైతులకు సరఫరా, మంత్రి సంతృప్తి 
ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ అరుణ్‌ కుమార్, ఆగ్రోస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు