అమ్మో నొప్పి!

5 Oct, 2014 00:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో జీర్ణకోశ వ్యాధుల విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నిల్వ నీటిని ఉపయోగించడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నట్టు వైద్యులు నిర్ధారిస్తున్నారు. గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు ఈ వ్యాధుల బారినపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
 
     అధికశాతం మందిలో హెపటైటిస్-ఎ, ఈ,తోపాటు జియార్డియా ఫొటో జోవా ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే హెలికో బ్యాక్టర్ పైలోరీ అధికంగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 
     దీనికంటే అత్యంత ప్రమాదకరమైన ఎక్యూట్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ అనే పేరుతో పిలవబడే నోటిఫైడ్ డిసీజ్ కేసులు కూడా అక్కడక్కడా వస్తున్నట్లు తెలుస్తుంది.
     నోటిఫైడ్ డిసీజ్ కావడంతో బయటకు పొక్కితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో ప్రైవేట్ వైద్యశాలల వైద్యులు గప్‌చుప్‌గా చికిత్స చేసి పంపివేస్తున్నారు.
 
     అంతేకాకుండా యాంటీబయోటిక్ అసోసియేటెడ్ డయేరియా బాధితులు అధికమ య్యారు. యాంటీబయోటిక్స్ అధికంగా వాడటం వల్ల అనారోగ్యం పాలై దీని బారిన పడతారు. ఇది అధికంగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన రోగులకు వస్తుంది.
 కలుషిత నీరు, నూనెల వల్లే వ్యాధులు :
 
     వీధి బళ్లపై దొరికే పానీపూరి, పండ్ల రసాల్లో ఉపయోగించే ఐస్, హోటళ్లలో సాంబా ర్, రసం వంటి వాటిలో కలుషితమైన నీరు వాడుతున్నారనీ,  వీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు.
     అంతేకాకుండా బిర్యాని తయారీలో కల్తీ నూనెలు వాడటంతో ఆ తరహా బిర్యానీలు తిని అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు.
     కాచి చల్లార్చిన నీటిని వినియోగించడం, భోజనానికి ముందు చేతులు శుభ్ర పర్చు కోవడం చేస్తే రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
 వ్యాధి లక్షణాలు, నివారణా చర్యలు :
 
     పొట్టలో కుడిపక్క పైభాగాన నొప్పి రావడం, ఆకలి తగ్గిపోవడం, వాంతులు వంటి లక్ష ణాలు కనిపిస్తే హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వ్యాధిగా భావించాలి. హెపటై టిస్-ఎ రాకుండా పిల్లలు, పెద్దలు నెలరోజుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ వాడితే సరిపోతుంది.
 
     హెపటైటిస్-ఈకి మాత్రం వ్యాక్సిన్ లేదు. ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టడమే. చివరకు ఇది అధికమై కామెర్లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
 
     జియార్డియా ఫొటోజోవా ఇన్‌ఫెక్షన్ వచ్చిన రోగులకు కడుపులో ఉబ్బరం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడతారు. కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాచి చల్లార్చిన నీటిని తాగితే నివారించవచ్చు.
 
     ఎక్యూట్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ అనే పేరుతో పిలవబడే నోటిఫైడ్ డిసీజ్ వస్తే కడుపు పైభాగాన నొప్పి, వాంతులు, రోజుకు 10 నుంచి 12 సార్లు నీళ్ల విరేచనాలతో బాధప డతారు.  3 సార్లు విరేచనాలకు ఒక లీటరు చొప్పున ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం ఇవ్వాల్సి ఉంటుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది.
 
 
     హెలికో బ్యాక్టర్ పైలోరీ అనే వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. కడు పులో పేగుపూత వస్తుంది. డాక్టర్‌ను సంప్రదించి 14 రోజులపాటు మందులు వాడితే తగ్గిపోతుంది. జిల్లాలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
 ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం...
     కలుషిత నీటిని తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటే నివారణా చర్యలు చేపట్టాల్సిన వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయ లోపంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 \u3149?ట్చఛగ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, నిల్వ ఉన్న నీటిని తాగాల్సి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు.
 
     వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆశించిన స్థాయిలో అది జరగడం లేదు. వీధి బళ్లు, హోటళ్లలో ఉపయోగించే కల్తీలపై కూడా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
     ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.



 

మరిన్ని వార్తలు