విభజన హామీలపై 25న మానవహారం

12 Jul, 2018 08:34 IST|Sakshi
పోస్టర్‌లు ఆవిష్కరిస్తున్న ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

వైవీయూ : విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కోటిమందితో మానవహారం నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి. దస్తగిరి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహలు మానవహారంపై రూపొందించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేకప్యాకేజి, గిరిజన, సెంట్రల్, మైనింగ్‌ యూనివర్సిటీల ఏర్పాటు, పోలవరం పూర్తి, ఎయిమ్స్, మెట్రోలైన్స్, రాజధాని నిధులు తదితర హామీలను నెరవేర్చాలంటూ మానవహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శివ, మధు, శివకుమార్, పుల్లయ్య, రాజేంద్ర, ప్రసాద్‌ పాల్గొన్నారు.

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరు తూ ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో మానవహారాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఉక్కు పరిశ్రమ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ దీక్షలు చేయడం అధికారాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు సదస్సులు, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో మైదుకూరులో సీపీఐ జిల్లా మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేశు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు