మూగయువతిపై హత్యాచారం

12 Jul, 2018 08:30 IST|Sakshi

దివ్యాంగురాలిపై లైంగికదాడి.. యువకునికి యావజ్జీవం

వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పాపం.. ఆ యువతి పుట్టుకతో మూగ. పైగా ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన యువకుడు లైంగికదాడి చేసి హతమార్చాడు. మరో కేసులో దివ్యాంగురాలైన యువతిపై లైంగికదాడి చేసిన నిందితుడు జీవించి ఉన్నంతకాలంలో జైలుశిక్ష అనుభవించేలా కోర్టు తీర్పుచెప్పింది. ఈ రెండు సంఘటనలు శివగంగై, కరూరు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

శివగంగై జిల్లా తిరుపత్తూరు సమీప గ్రామానికి చెందిన దంపతులు మంగళవారం కూలీ పనికి వెళ్లడంతో మూగదైన వారి 18 ఏళ్ల కుమార్తె ఇంటిలో ఒంటరిగా ఉంది. అదే ప్రాంతానికి చెందిన కల్యాణి తన తోటలో పశువులు మేపేందుకు వెళ్లినపుడు మూగ యువతి తీవ్రమైన రక్తగాయాలై ప్రాణాలుపోయిన స్థితిలో పడిఉండడాన్ని గుర్తించింది. కీళ్‌సివల్‌పట్టికి చెందిన పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని నిందితుల గాలింపు కోసం ప్రత్యేకబృందం ఏర్పాటు చేశారు. బాధిత యువతి నివాసానికి సమీపంలోని మాణిక్యం (27) అనే  పెయింటర్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. లైంగిక దాడి చేసేందుకు మాణిక్యం ఇంటిలోకి చొరబడగా పాపం ఆమె మూగ గొంతుతోనే కేకలు వేసే ప్రయత్నం చేసింది. ఏమాత్రం జాలి, దయలేని ఆ మృగాడు ఇనుపరాడ్డుతో ఆమె తలపైకొట్టి తోటలోకి ఎత్తుకెళ్లాడు. అ తరువాత లైంగికదాడికి పాల్పడి హతమార్చాడని పోలీసులు తెలిపారు.

జీవించినంత కాలం జైలుశిక్ష
కరూరు జిల్లా కుళిత్తలైలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకుని ఉన్న జంబులింగం అలియాస్‌ రాజ్‌కుమార్‌ (32) తనకు సమీపంలోనే నివసిస్తున్న మానసిక రుగ్మతలతో బాధపడుతున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. 2016 నవంబరు 3వ తేదీన ఇంటిలో ఎవరూ లేకుండా చూసి వెంటబెట్టుకుని దూరంగా తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి తల్లి (శివభాగ్యం) కుళిత్తలై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌చేశారు. ఈ కేసు విచారణ కరూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కొనసాగింది. నిందితుడు రాజ్‌కుమార్‌ జీవించి ఉన్నంతకాలం జైల్లోనే శిక్ష అనుభవించేలా న్యాయమూర్తి శశికళ మంగళవారం తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు