అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..

14 Mar, 2017 13:03 IST|Sakshi
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..

విజయవాడ: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్‌ జగన్‌పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు.

భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారని, అలాంటిది...ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ... ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారన్నారు.

ఇక భూమా నాగిరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్‌ పెట్టిందెవరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో అరెస్ట్‌ చేయించి వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు. ఆ రోజు భూమా నాగిరెడ్డిని కేసులతో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తానని చెప్పి, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు మోసంతోనే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ... ఆయన బతికి ఉన్నప్పుడు ఏం చేశారన్నారు.

హిందు సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ... ఆ కుటుంబసభ్యులు కనీసం మూడురోజుల పాటు అయినా ఊరి పొలిమేర దాటరన్నారు. అలాంటిది తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాలుకు తీసుకు రావడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ పాత్ర ఉందన్నారు. ఒక​ మహిళగా అఖిలప్రియ బాధ, ఆవేదన, సంఘర్షణను తాము అర్థం చేసుకుంటామన్నారు.

అలాంటిది ఓ అమాయకురాలి చేత లేనిపోని అబద్ధాలు మాట్లాడించారన్నారు. తనను ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు రమ్మనలేదని, తన అంతట తానుగానే వచ్చానని అఖిలప్రియతో చెప్పించారన్నారు. ఆమెను చంద్రబాబు, ఆయన కుమారుడే బలవంతంగా సమావేశాలకు రప్పించారన్నారు. నూతన రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో హాజరు కాని అఖిలప్రియ.... తండ్రి చనిపోయి పట్టుమని మూడు రోజులు కూడా కాకముందే సభకు ఎలా వచ్చారన్నారు.

ఇక భూమా సంతాప తీర్మాన కార‍్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ప్రతిపక్ష పార్టీపై టీడీపీ బురద జల్లుతుందన్నారు. ప్రజల ముందు తమను తప్పుగా చిత్రీకరించేందుకు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విలువల గురించి మాట్లాడేవారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నైతిక విలువలతో కూడిన రాజకీయమా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. సంతాప తీర్మానంలో ఎక్కడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు.