ఏనీటైం మద్యం!

9 May, 2019 12:54 IST|Sakshi

బారుల్లా పర్మిట్‌ రూమ్‌లు!

రాత్రింబవళ్లు యథేచ్ఛగా అమ్మకాలు

సమయం మించిన తర్వాత అధిక రేట్ల వసూళ్లు

జిల్లా వ్యాప్తంగా గొలుసు దుకాణాలదే హవా

పర్మిట్‌ రూమ్‌లు.. మందుబాబులు రోడ్ల మీద మద్యం సేవించకుండా అడ్డుకట్ట వేసేందుకు అధికారుల అనుమతితో దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే చిన్న గదులు.. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా అక్కడే మద్యం సేవించాలన్నది నిబంధన. అయితే ప్రస్తుతం ఇవి బారులను తలపిస్తున్నాయి. రాత్రింబవళ్లు వీటిల్లో మద్యం తాగుతూ.. ఆహారం తింటూ మందుబాబులు కాలం గడుపుతున్నారు. స్థానికంగా నివాసాలు ఉంటున్న వారికి తీవ్ర ఆటంకం కలుగజేస్తున్నారు. మద్యం దుకాణదారులు సమయాన్ని పాటించకుండా యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతుండటంతో పర్మిట్‌ రూమ్‌లు నిత్యం రద్దీగా దర్శనమిస్తున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా పరిధిలో సుమారు 336 వరకు మద్యం దుకాణాలు, 157కి పైగా బారులు ఉన్నాయి. సమయాలు, దుకాణాల నిర్వహణపై నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ జిల్లా పరిధిలోని చాలా దుకాణదారులు సమయాలను పాటించడం లేదు. ఉదయం దుకాణం తెరిచే సమయంలో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ.. రాత్రిళ్లు మాత్రం అర్ధరాత్రి దాటినా అమ్మకాలు సాగిస్తున్నారు. విజయవాడలో చాలా మద్యం దుకాణాలు రహదారి పక్కనే ఉన్నాయి. వీటి సమీపంలో ఉన్న అనుమతి గదులు నిత్యం మందుబాబులతో రద్దీగా ఉంటున్నాయి. రహదారులపై ప్రయాణాలు సాగించేందుకు మహిళలు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు మద్యాన్ని రోడ్డుపైనే తాగుతున్నారని వారు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. 

బార్లను తలపిస్తున్న దాబాలు..
విజయవాడ, మచిలీపట్నంలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో మద్యం అమ్మకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ఆబ్కారీ అధికారులు ఏమాత్రం పటించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మద్యం దుకాణదారులు రాత్రి సమయంలో బయటకు ఉండే తలుపులు మూసేసి వెనక ఉండే ద్వారాలను తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న దాబాలు బారులను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వీటిల్లోకి మద్యం అనుమతించకూడదు. బయటి నుంచి తెప్పించి దాబాల్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ధరల్లోనూ వ్యత్యాసం..
జిల్లా పరిధిలోని చాలా మద్యం దుకాణాలు అనధికారికంగా గొలుసు దుకాణాలను నిర్వహిస్తున్నాయి. దుకాణాలను మూసివేసిన సమయాల్లో ఈ గొలుసు దుకాణాలు జోరుగా అమ్మకాలు సాగిస్తాయి. వీటిల్లో ప్రతి మద్యం సీసాకు రూ.20 నుంచి రూ.50ల వరకు ఎక్కువ ధరలు ఉంటున్నాయి. మద్యం దుకాణాలు నిర్వాహకులే వీటిని అనధికారికంగా నిర్వహించటంతో ఈ గొలుసు దుకాణాలపై వారు ఫిర్యాదు చేయట్లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గొలుసు దుకాణదారులదే హవా. ఎక్కడకైనా మద్యం సరఫరా చేస్తూ భారీస్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

తరచూ ఘర్షణలు..
మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన అనుమతి గదులు మందుబాబులతో నిండి ఉంటున్నాయి. మద్యం దుకాణం తెరచి ఉన్నప్పుడే వీటిని తెరవాలి. చాలా అనుమతి గదులు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. వీటిల్లోనే వివిధ ఆహార పదార్థాలను అమ్ముతూ కొందరు, సమీపంలోని ఆహారశాలల నుంచి మరికొందరు సరఫరా చేస్తున్నారు. అనుమతి గదుల్లో మందుబాబులు తరచూ వివాదాలకు, కొట్లాటలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడలోని ఓ బార్‌లో రెండు వర్గాలు బీరు సీసాలతో కొట్టుకోవడంతో ఒక వ్యక్తి మృతిచెందారు.

>
మరిన్ని వార్తలు