వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: కిరణ్‌కుమార్‌రెడ్డి

25 Oct, 2013 04:00 IST|Sakshi
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: కిరణ్‌కుమార్‌రెడ్డి

అధికారులకు సీఎం ఆదేశం
 నిధుల ఖర్చుపై కలెక్టర్లకు అధికారాలు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లతోపాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో గురువారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం నిధులను నేరుగా టీఆర్ -27 ద్వారా డ్రా చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని, ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జాతీయ విపత్తు సహాయక దళానికి చెందిన బృందాలు వరద సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమీక్ష కార్యక్రమంలో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, విపత్తు నిర్వహణ కమిషనర్ టి.రాధ తదితరులు పాల్గొన్నారు. వరద సహాయక కార్యక్రమాల విషయంలో సర్పంచులు అధికారులకు సహకరించాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎంతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
 
 నేడు ఆంధ్ర, కర్ణాటక మంత్రుల సమావేశం
 అనంతపురంజిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు శుక్రవారం బెంగళూరులో భేటీ కానున్నారని మంత్రి రఘువీరా తెలిపారు. దీనికి తనతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్, ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు