జాతరకు పక్కాగా ఏర్పాట్లు

4 Jan, 2019 07:40 IST|Sakshi
వీఆర్‌ఎస్‌ ప్రాజక్ట్‌ వద్ద పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

బొబ్బిలి ఏఎస్పీ గౌతమీ శాలి

విజయనగరం, మక్కువ(సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఏఎస్పీ గౌతమీశాలీ అధికారులను ఆదేశించారు. మండలంలోని శంబర గ్రామాన్ని గురువారం సందర్శించిన ఆమె ముందుగా గ్రామంలో కొలువైన అమ్మవారిని ఐపీఎస్‌  అధికారి సుమీత్‌తో కలసి దర్శించుకున్నారు. విశ్రాంత ఈవో నాగార్జున, ఉత్సవ కమిటీ సభ్యులు వారిని సాదరంగా స్వాగతించి, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఏఎస్పీ గౌతమీశాలీ చదురుగుడి వెనుకన ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. ఏటా ఉచితం, రూ. 10ల, రూ. 50ల క్యూలైన్లును ఒకేచోట ఏర్పాటు చేయడంతో, భక్తులు ఇబ్బందులు పడుతున్నందున, చదురుగుడి వెనుకన ఉన్న మరో రహదారి వద్ద రూ. 50లు క్యూలైన్‌ ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలని విశ్రాంతి ఈవో నాగార్జునకు సూచించారు. అనంతరం గ్రామంలో సిరిమాను తిరిగే ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు.

సిరిమాను తిరిగే ప్రదేశాలలోని పలుకాలువలపై పలకలు లేకపోవడంతో, ఏటా భక్తులు ప్రమాదబారిన పడుతున్నారని, స్థానికులు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా పంచాయతీరాజ్‌ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే సిరిమానును పూజారి అధిరోహించే ముందు, సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది భక్తులు సిరిమాను వద్దకు వచ్చి మొక్కుబడులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందని, సిరిమాను వద్ద బారికేడ్లు, రోప్‌పార్టీ పోలీసులు ఉండటం వల్ల, భక్తుల మధ్య తోపులాటలు జరిగి, స్థానికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండటం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాల, వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ సమీపంలోని పార్కింగ్‌స్థలాలను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి కోళ్లు మొక్కుబడులు చెల్లించిన అనంతరం, గోముఖీనది వద్ద కోళ్లను శుభ్రం చేయడంతోపాటు, మాంసం చేయడంతో వ్యర్ధప్రదార్ధాలు పేరుకుయి దుర్వాసర వెదజల్లి, భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్గిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ గోముఖీనది, వనంగుడి వద్ద కోళ్లను శుభ్రంచేసేందుకు అవసరమైన ప్లాట్‌ఫాంలు ఏర్పాటుచేయడంతోపాటు, వ్యర్ధపదార్థాలు పోగుచేసేందుకు ఫిట్‌ను ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా, గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై షేక్‌శంకర్, ఉత్సవ కమిటీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ గంజి కాశినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.  

శంబర జాతరపై 6న సమీక్ష
పార్వతీపురం: శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల ఆరోతేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించనున్న సమావేశానికి జాతరకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు