మెడికల్‌ కళాశాలల ఆధునికీకరణే లక్ష్యం

30 Jun, 2020 04:18 IST|Sakshi
అనంత జిల్లాలో స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రులు ఆళ్ల నాని, శంకరనారాయణ

హిందూపురం/పులివెందుల రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లతో మెడికల్‌ కళాశాలలు, హెల్త్‌ సబ్‌ సెంటర్ల ఆధునికీకరణే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఆయన సోమవారం అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో ఆస్పత్రి, మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి తదితరులతో కలిసి పరిశీలించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్య సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీని సీఎం జగన్‌ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. వీటికి సంబంధించి టెండర్లను ఆగస్టులో పిలవాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు