టీడీపీ నిరంకుశ పాలనకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

10 Nov, 2018 07:51 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని

పశ్చిమగోదావరి, దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నిరంకుశ పాలనకు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్ని రకాల బంధాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అన్నారు. శుక్రవారం ఏలూరు మోతేవారి వీధిలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని దెందులూరు పార్టీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన ఆళ్ల నాని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యువత, వృద్ధులు, విద్యార్థులు టీడీపీ నిరంకుశత్వ పాలన, దౌర్జన్యాలపై విసిగిపోయారన్నారు. ఉద్యోగులను కొట్టడం, బండ బూతులు తిట్టడం, అందరిపై దౌర్జన్యం చేయటం, జిల్లా, మండల అనే స్థాయి సైతం చూడకుండా చివరకు తన సమాచారాన్ని ప్రజలకు చేర వేసే విలేకరులపై సైతం బండ బూతులు తిట్టిన ఏకైక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. సాధారణ వ్యక్తిత్వం, ఉన్నత విలువలతో జీవించే వైఎస్సార్‌ సీపీ పెదపాడు మండల కన్వీనర్‌ అప్పన ప్రసాద్‌పై టీడీపీ ప్రభుత్వం ఓర్వలేక రౌడీషీట్‌ తెరవటం దుర్మార్గమన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఇసుక, భూదందా, మట్టి దందా జరుగుతున్నాయని అబ్బయ్య చౌదరి నేరుగా జేసీబీలను అడ్డుకుని జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి రెండు నెలలయినా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోకపోగా ఇది పెద్ద విషయం ఏమీ కాదని వ్యాఖ్యానించటం తనకెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

వైసీపీ జెండా చూసి వణుకుతున్న టీడీపీ
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట, గుర్రపు పందాలు, కాంట్రాక్టుల్లో అవినీతి.. ఇవే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆదాయ వనరులని విమర్శించారు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి టీడీపీ ప్రభుత్వం పూనుకుందంటే వైఎస్సార్‌ సీపీ జెండాను చూస్తే పచ్చ పార్టీ నేతలకు వణుకు పుడుతుందన్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎవరైనా నేరుగా ఏ సమస్య మీద అయినా కార్యాలయం, తనకు ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చన్నారు. సమావేశంలో రెండు జిల్లాల పార్టీ మహిళా కోఆర్డినేటర్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కైకలూరు కన్వీనర్‌ డి.నాగేశ్వరరావు, చింతలపూడి కన్వీనర్‌ ఎలీజా, గోపాలపురం కన్వీనర్‌ తలారి వెంకటరావు, యుఎస్‌ఏ పార్టీ కోఆర్డినేటర్‌ కడప రత్నాకర్,  మాజీ మంత్రి మరడాని రంగారావు, జిల్లా అధికార ప్రతినిధులు కొఠారు రామచంద్రరావు, రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, యువజన విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెం ప్రసాద్, పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కమ్మ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు, పెదవేగి, ఏలూరు రూరల్‌ మండలాల అధ్యక్షులు బొమ్మనబోయిన నాని, మెట్లపల్లి సూరిబాబు, తేరా ఆనంద్‌తో పాటు పెద్ద సంఖ్యలో  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు