అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనం

10 Jul, 2014 03:45 IST|Sakshi
  • అమ్మవారి దర్శన సమయంలో మార్పు
  • జేఈవో పోలా భాస్కర్
  • తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తరహాలో బ్రేక్ దర్శనం అమలుచేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం అమ్మవారి ఆస్థాన మండపంలో అర్చకులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనం(కుంకుమార్చన) ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు.

    అలాగే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దాదాపు గంట సమయం పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతిరోజూ (శుక్రవారం మినహా) ఉదయం 5 గంటలకు అమ్మవారి ఆలయాన్ని తెరుస్తున్నారని, త్వరలోనే వేకువజామున 4.30 గంటలకు అమ్మవారి ఆలయం తీసేందుకు సన్నాహాలు చేపడతామన్నారు. అలాగే రాత్రి (శుక్రవారం మినహా) 8.45 గంటలకు నిర్వహించే ఏకాంతసేవను 9.30 గంటలకు నిర్వహించాలనే విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
     
    బ్రేక్ దర్శనం..

    అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకునేం దుకు భక్తులు ఇష్టపడుతుంటారని, ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు గంటల పాటు బ్రేక్ దర్శనం అమలు చేసి ఆ సమయంలో కుంకుమార్చన సేవ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ దర్శనంలోనే రూ.100 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులను సైతం అనుమతిస్తామని పేర్కొన్నారు.
     
    అపవాదును తొలగించుకునేందుకే...
     
    ప్రొటోకాల్‌కు అనుగుణంగా వీఐపీలకు అన్ని మర్యాదలతో దర్శనం చేయించాల్సి వస్తోందన్నారు. ఇవేమి తెలియని సామాన్య భక్తుల నుంచి టీటీడీ అధికారులు కొందరికే పరిమితమవుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారని తెలిపారు. ఈ అపవాదును తొలగించుకునేందుకే బ్రేక్ దర్శనం అమలు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల తరహాలోనే అమ్మవారిని బ్రేక్ దర్శనంలోనే వీఐపీలు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పద్ధతికి అలవాటు పడేలా అంచెలంచెలుగా బ్రేక్ దర్శనాన్ని అమలుచేయనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు