అనకాపల్లి వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా కడుబండి

21 Oct, 2015 23:25 IST|Sakshi
అనకాపల్లి వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా కడుబండి

విశాఖపట్నం:  సంస్థాగత బలోపేతం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ మరో ముందడుగు వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడిగా కడుబండి శ్రీనివాసరావును నియమించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు  శ్రీనివాసరావును నియమించినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు.

 ఆది నుంచి పార్టీలో క్రియాశీల పాత్ర
 అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన కడుబండి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆది నుంచి క్రియాశీల పాత్ర  పోషిస్తున్నారు. ఆయన విజయనగరం జిల్లా గజపతినగర నియోజకవర్గంలో  ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారు.  ఆయన పెదనాన్న వంగపండు నారాయణ అప్పల నాయుడు గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన చిన్నాన్న సమితి ప్రెసిడెంట్‌గా చేశారు. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్న  కడుబండి శ్రీనివాసరావు 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన ఆయనను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.  2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. ఆయన భార్య అమెరికాలో ప్రముఖ క్యాన్సర్ వైద్యురాలిగా గుర్తింపుపొందారు.

పార్టీ బలోపేతం.. విజయమే లక్ష్యం: శ్రీనివాసరావు
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే తన లక్ష్యమని కడుబండి శ్రీనివాసరావు చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో  పార్టీ నేతలు, కార్యకర్తలం సమష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.  అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానన్నారు.
 

మరిన్ని వార్తలు