పొదుపు డిపాజిట్ స్వాహా?

22 Jan, 2016 01:24 IST|Sakshi

ఆమదాలవలస/రూరల్:పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట డ్వాక్రా సం ఘాల సభ్యులు ఆందోళన చేశారు. డ్వాక్రా సంఘాల పొ దుపు డిపాజిట్ డబ్బులను వెలుగు సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్) ఉమాదేవి స్వాహా చేసినట్టు ఆరోపించా రు. ఏపీఎంను, బ్యాంకు అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరుబుజ్జిలి మండలం డకరవలస పంచాయతీ పరిధి డకరవలస, సుభద్రాపురం, సూర్యనారాయణపురం గ్రామాల్లో 18 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ఆమదాలవలస పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా బ్యాంకులో పొదుపు డిపాజిట్, వెలుగు రుణాలు వంటివి లావాదేవీలు జరుగుతుండేవి. డకరవలస పంచాయతీ ఆంధ్రా బ్యాంకుకు దత్తత గ్రామం కావడంతో మండలం వేరొకటి అయినా బ్యాంకు రుణాలు మాత్రం ఈ బ్యాంకులోనే పొందాలి.
 
  ఈ లావాదేవీలు జరుగుతున్న క్రమంలో 18 డ్వాక్రా సంఘాలకు చెందిన పొదుపు డిపాజిట్ సొమ్ము స్వాహా చేశారు. ఒక్కొక్క సంఘం నుంచి రూ. 7,200 చొప్పున మొత్తం రూ. 1,29,600 స్వాహా జరిగినట్టు డ్వాక్రా సంఘాల అధ్యక్షులు సైలాడ శారదమ్మ, చింతాడ రూపావతి, కొల్ల రమణమ్మ, కొల్ల సుగుణమ్మ, బెవర జ్యోతి, కొల్ల కరుణమ్మతో పాటు మరికొంత మంది సభ్యులు ఆరోపించారు. ఎటువంటి తీర్మానాలు లేకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి మా డిపాజిట్ సొమ్మును స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాల తీర్మానాలు చేయకుండానే సొమ్ములు ఎలా మాయం చేశారని బ్యాం కు అధికారులను నిలదీయడంతో బ్యాంకు మేనేజర్ వి.సురేష్‌రాజు స్పందిస్తూ పొదుపు డిపాజిట్ ఎవరూ స్వాహా చేయలేదన్నారు.
 
  ఆ సొమ్మును మీ సంతకాలతో ఉన్న విత్‌డ్రా ఫారమ్‌లు సీఎఫ్ మాకు అందించడంతో స్త్రీనిధి ద్వారా సమృద్ధి పథకానికి చెల్లించినట్టు తెలిపారు. ఎవరి అనుమతులు, సంతకాలు చేయకుండానే సంఘాల సొమ్మును వేరొక పథకానికి ఎలా జమ చేస్తారని సభ్యులు బ్యాంకులో గట్టిగా కేకలు వేయడంతో బ్యాంకు మేనేజర్ సరుబుజ్జిలి ఏపీఎం ఎం.కూర్మారావుకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. బ్యాంకుకు చేరుకున్న ఏపీఎంను సంఘాల సభ్యులు నిలదీశారు. సీఎఫ్  సొమ్మును స్వాహా చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి బ్యాంకుకు చేరుకుని సంఘాల సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పొదుపు డిపాజిట్ సొమ్ము సంఘాల సభ్యులకు తెలియకుండా విత్‌డ్రా చేసిన విధానంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు  సొమ్ములను తిరిగి సంఘాల సభ్యులకు చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
 

>
మరిన్ని వార్తలు