కొల్లేరును ధ్వంసం చేస్తున్నదెవరు!

24 Dec, 2014 00:41 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘కొల్లేరు వాసుల కష్టాలను పరిష్కరించేందుకు కలసి ముందుకు వెళ్దాం. జరిగింది వదిలేద్దాం. సరస్సును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించే ప్రతిపాదనకు మేం మద్దతిస్తాం. కొల్లేరు ప్రజల కోసం మీకు సహకరిస్తాం. అందరం కలిసి ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళ్దాం..’ అని కొల్లేరు వాసుల కష్టనష్టాలపై మంగళవారం అసెంబ్లీలో గళం విప్పిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు సహా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవాకులు చెవాకులు పేలారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన తీర్మానాన్నే మళ్లీ ప్రవేశపెట్టినా..  రాజ కీయ కోణంలో చూడకుండా కొల్లేరు ప్రజల కోసం తాను మద్దతిస్తున్నామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినా టీడీపీ నేతలు నిండు సభలో చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలోని కొల్లేటి తీరంలో ఆగడాలు సృష్టిస్తున్నదెవరు.. ఆరు నెలల టీడీపీ పాలనలో కొల్లేటి తీరంలో ఏం జరుగుతుందో పరిశీలిస్తే.. తెలుగు తమ్ముళ్ల అసలు రంగు ఏమిటో అవగతమవుతుంది.
 
 బినామీల ముసుగులో వేలాది ఎకరాలు కైంకర్యం
 అధికారం దన్నుతో ఆరు నెలలుగా రెచ్చిపోతున్న టీడీపీ నేతలు కొల్లేరులో ఇష్టారాజ్యంగా పాగా వేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇందుకోసం కొత్త ఎత్తులతో బినామీ అవతారాలు ఎత్తుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు. లంక గ్రామాల్లో ప్రజలు బంటాలు (కమతాలు)గా ఏర్పడి తమకు కేటాయించిన చెరువులను సాగు చేస్తుంటారు. ఎకరానికి రూ.10వేల నుంచి రూ.12 వేల చొప్పున చెల్లించేలా వారినుంచి టీడీపీ నేతలు చెరువులను లీజుకు తీసుకుంటున్నారు. వీటిని తిరిగి బడా బాబులకు ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలకు లీజు ఇస్తున్నారు.
 
 10 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుల లీజు రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలు పలికింది. ఇలా కేవలం లీజు అగ్రిమెంట్ ద్వారా టీడీపీ నాయకులు చెరువు యజమానులు అయిపోతున్నారు. చెరువులు లీజుకిచ్చేందుకు వ్యతిరేకించే వారికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. లీజుకివ్వని చెరువు యజమానులను వేధింపులకు గురి చేస్తున్నారు. చెరువు అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీ శాఖ అధికారులతో గట్లను కొట్టిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా ఏలూరు మండలంలో గుడివాకలంక, కోమటిలంక, ప్రత్తికోళ్లలంక, మొండికోడుల్లో వేలాది ఎకరాల చెరువులను టీడీపీ నాయకులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు.
 
 అటవీ శాఖ సిబ్బందికీ బెదిరింపులు
 ఇటీవల కాలంలో అటవీ శాఖ అధికారులను బెదిరించి యథేచ్ఛగా చెరువులు తవ్వడం ఇక్కడ సాధారణమైపోయింది. కళ్లెదుటే చెరువులు తవ్వుతున్నా అటవీశాఖ అధికారులు ఏమీ చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈమధ్యనే ఏలూరు మండలం పైడిచింతపాడు వద్ద కొల్లేరులో చేపల దొడ్లు పేరుతో 200 ఎకరాల్లో చెరువులు తవ్వారు. పదుల సంఖ్యలో పొక్లెయిన్లతో చెరువులను తవ్వారు. సుమారు 15 రోజులపాటు ఈ తతంగాన్ని నడిపించారు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న అటవీశాఖ సీవీఎస్ శ్రీధర్ గ్రామానికి చేరుకుని చేపల దొడ్లు (చెరువులను) పరిశీలించారు. కళ్లెదుటే కొల్లేరును ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారని అధికారులను, సిబ్బందిని ప్రశ్నించారు. తక్షణం గట్లు తొలగించాలని డీఎఫ్‌వో శ్రీనివాస్‌ను, సిబ్బందిని ఆదేశించారు. లేదంటే చర్యలు చేపడతానని హెచ్చరించి వెళ్లారు.  సిబ్బంది ప్రక్షాళనకు సిద్ధపడటంతో అసలు డ్రామా మొదలైంది. ఓ ప్రజాప్రతినిధి రంగ ప్రవేశం చేశారు. గట్లు కొట్టే సిబ్బందిపై తిరగబడాలని గ్రామస్తులను రెచ్చగొట్టారు. గట్లు తొలగించకుంటే ఉద్యోగాలు పోతాయంటూ అటవీ సిబ్బంది ఆ  నాయకుడిని బతిమలాడటంతో పాక్షికంగా గట్లు కొట్టేందుకు ఒప్పుకున్నారు. దీంతో సిబ్బంది తూతూమంత్రంగా గట్లు కొట్టి చేతులు దులుపుకున్నారు.
 
 చెరువుగా మారిన పేదల ఇళ్ల స్థలాలు
 కొల్లేరు గ్రామాల్లో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను సైతం టీడీపీ నేతలు చెరువులుగా మార్చేశారు. ఏళ్ల తరబడి గుడిసెల్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోని నాయకులు తహసిల్దార్ ఎన్‌వీ రామాంజనేయులు చూస్తుం డగానే పైడిచింతపాడులో 11 ఎకరాల్లో చెరువు తవ్వేశారు. ఆ తర్వాత చెరువును లీజుకిచ్చి సొమ్ము చేసుకున్నారు. ఇలా టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న ఆక్రమణలతో కొల్లేరు కుచించుకుపోతోంది.
 
 కాంటూరు కుదింపునకు ఓకే
 ఏలూరు/ఏలూరు రూరల్ : కొల్లేరు సరస్సును కాంటూరు 5 నుంచి కాంటూరు 3కు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మంగళవారం అసెం బ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచే కాంటూరు కుదింపు తీర్మానానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కుదింపు పక్రియపై ఇక్కడితో ఆగకుండా అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాంటూరు కుదింపు ఫలాలను కొల్లేరు ప్రజలకు వీలైనంత త్వరగా చేరువ చేయూలని ఆయన కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలోనే ఈ మేరకు తీర్మానం చేయగా, ప్రస్తుత శాసనసభలో తిరిగి అదే తీర్మానం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే కొల్లేరు వాసుల కష్టాలు గట్టెక్కుతారుు. కాంటూరును 5నుంచి 3కు కుదిస్తే కొల్లేరు పరిధిలో సుమారు 48 వేల ఎకరాలు సాగులోకి వస్తారుు. ఆ భూములను కొల్లేరు గ్రామాల్లోని పేదలకు పంపిణీ చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలతోపాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం సాకారం అవుతారుు. కొల్లేరు అంశంపై జరిగిన చర్చలో కైకలూరు ఎమ్మెల్యే, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు  పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు