చుక్కలు చూపించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష

27 May, 2019 11:06 IST|Sakshi
పరీక్షా కేంద్రంలోకి వెళుతున్న అభ్యర్థులు

కడప కల్చరల్‌/ సాక్షి, అమరావతి: ‘సౌత్‌పోల్‌ అంటే యూత్‌ పోల్‌. మీడియేషన్‌ అంటే మెడిటేషన్‌. బై క్యామెరల్‌ అంటే రెండు కెమెరాల విధానం. క్రూడ్‌ బర్త్‌ రేట్‌ అంటే మూడిద పుట్టుక, మూడిద మరణం’ అంతా పిచ్చిపిచ్చిగా అనిపిస్తోంది కదూ. మనకే ఇలా ఉంటే.. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొని ఆదివారం గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే అవకాశం ఉండడంతో కొంతమంది అభ్యర్థులు తెలుగులోనే పరీక్షలు రాశారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంగ్లిష్‌ ప్రశ్నలకు ఇచ్చిన తెలుగు అనువాదాన్ని చూసి తెలుగు మీడియం అభ్యర్థులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంగ్లిష్‌ ప్రశ్నలకు అత్యంత సులువుగా తెలుగులో అనువాదం ఇచ్చే అవకాశం ఉన్నా తెలుగు పండితులు సైతం అర్థం చేసుకోలేని విధంగా ఘోరమైన అనువాదంతో ప్రశ్నలు ఇచ్చారు.

ఇదంతా ప్రశ్నపత్రంలోని ‘డి’ సిరీస్‌లో జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలుగు అనువాదం అధ్వానంగా ఉండటంతో పలుమార్లు ఇంగ్లిష్‌ ప్రశ్నలతో పోల్చి చూసుకుంటే గానీ తెలుగు ప్రశ్న అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏపీపీఎస్సీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన సమయంలో తెలుగు ప్రశ్నలను అర్థం చేసుకునేందుకు సమయం చాల్లేదని, దీంతో తాము దాదాపు పది మార్కుల వరకు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘భారత రాజ్యాంగ ఫెడరల్‌ లక్షణాలు కానివి ఏవి’ అంటూ ఇచ్చిన ప్రశ్నకు బై క్యామెరల్‌ లెజిస్లేచర్‌ అన్న అర్థం రావాల్సి ఉండగా.. ‘రెండు కెమెరాల చట్టం’ అంటూ తెలుగులో సమాధానం ఇవ్వడం గమనిస్తే ప్రశ్నపత్రం రూపకల్పన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తికమక ప్రశ్నలు ‘డి’ సిరీస్‌ ప్రశ్నపత్రంలో పది వరకు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్‌–2 పరీక్షల్లో కూడా ఏపీపీఎస్సీ స్వామి భక్తిని ప్రకటించుకునేలా చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై ప్రశ్నలు ఇవ్వడం పలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనైనా గ్రూప్‌–1 ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా రూపొందించి ఉండాల్సిందని అభ్యర్థులు అంటున్నారు.


గ్రూప్‌–1 ప్రశ్నపత్రంలో తికమకగా ఉన్న తెలుగు అనువాదం (టిక్కులు వేసినవి)

నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులను ఇబ్బందిపెట్టిన పేపర్‌–2
ఈసారి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలోని ప్రశ్నలను సివిల్‌ సర్వీస్‌కు సమాన స్థాయిలో ఇచ్చారని అభ్యర్థులు వాపోయారు. పేపర్‌–1, పేపర్‌–2ల్లోని ప్రశ్నలన్నీ చాలా కఠినంగా ఉన్నాయని, సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మాత్రమే రాయగలిగే స్థాయిలో ప్రశ్నలు రూపొందించారని తెలిపారు. పేపర్‌–2 మ్యాథమెటిక్స్‌ అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. గ్రూప్‌–1 కేడర్‌ పోస్టులు కాబట్టి ఆ స్థాయిలో ప్రశ్నలు అడగడంతో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అర్హులయ్యే వారి సంఖ్య చాలా కుదించుకుపోనుంది. గతంలో గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్ట్‌లో 150 మార్కులకు జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఈసారి స్క్రీనింగ్‌ టెస్టును పేపర్‌–1, పేపర్‌–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచారు. పేపర్‌–2లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో మ్యాథమెటిక్స్, రీజనింగ్‌కు సంబంధించి 60 ప్రశ్నలుండడంతో మ్యాథ్స్‌ చదవని జనరల్‌ డిగ్రీ అభ్యర్థులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు.

చాలా వరకు తాము ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రుణాత్మక (నెగెటివ్‌) మార్కులుండడంతో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకుండా వదిలేశామని వివరించారు. మ్యాథమెటిక్స్‌ చదవని జనరల్‌ డిగ్రీ అభ్యర్థులు ఈసారి చాలా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొత్తగా పరీక్ష విధానాన్ని మార్చిన ఏపీపీఎస్సీ డిగ్రీ (మ్యాథ్స్‌) లేదా ఇంజనీరింగ్‌ చేస్తున్నవారికి మేలు కలిగేలా పేపర్‌–2ను పెట్టిందని వాపోతున్నారు. పైగా ఆంగ్లం, తెలుగులో ఇచ్చిన ఈ ప్రశ్నలు చదువుకొని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని, కొన్ని సందర్భాల్లో తెలుగు ప్రశ్నలు అర్థం కాక ఆంగ్ల ప్రశ్నలు చూసుకోవలసి వచ్చిందన్నారు. కొన్ని ప్రశ్నలకు ఆంగ్ల ప్రశ్నలు, సమాధానాల్లో ఒకటి సరైనదిగా ఉంటే తెలుగులోకి వచ్చే సరికి వేరే సమాధానం సరైనదన్న సందిగ్థం ఏర్పడిందని వివరించారు.

పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు
గ్రూప్‌–1 ప్రిలిమినరీకి తక్కువ మందే హాజరవుతున్నా పరీక్ష కేంద్రాలను మాత్రం సుదూరంలో కేటాయించడంతో అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారు. నగరాల్లో అనేక పరీక్ష కేంద్రాలున్నా వాటిని కాదని ఎక్కడో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులకు చుక్కలు కనిపించాయి. కొన్ని కేంద్రాలకు బస్సులు, ఆటోలు కూడా నడవని పరిస్థితి. పైగా ఆదివారం కావడంతో ఆటోలు కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రత్యేకంగా అద్దె కార్లు, ఆటోలు మాట్లాడుకుని చేరాల్సి వచ్చింది. కళాశాలలకు సరైన రోడ్లు కూడా లేని ప్రాంతాల్లో వాహనాలు పోయేందుకు అవకాశం లేక కిలోమీటర్ల మేర మండుటెండల్లో నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నానా ఇక్కట్లకు గురయ్యారు.

73.76 శాతం మంది హాజరు
రాష్ట్రంలో 169 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు 73.76 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పేపర్‌–1 జనరల్‌ స్టడీస్, మధ్యాహ్నం పేపర్‌–2 జనరల్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలు నిర్వహించారు. పేపర్‌–1కు 59,697 మంది, పేపర్‌–2కు 59,200 మంది హాజరయ్యారు. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 80,250 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు