జోక్యం చేసుకోలేం..

4 Mar, 2014 02:46 IST|Sakshi
జోక్యం చేసుకోలేం..

* మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్పష్టీకరణ
* మొత్తం ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేయండి
* చట్ట ప్రకారం ఎన్నికలను నిర్వహించండి
* ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్‌ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసినందున.. తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ (మేయర్లు, చైర్మన్, చైర్‌పర్సన్ ఎన్నికతో సహా)ను ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని.. దీనంతటినీ చట్టప్రకారం నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయలేదని.. చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు హైకోర్టులో సోమవారం అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘మీరు ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతున్నారా..?’ అని ప్రశ్నించింది.

అటువంటిదేమీ లేదని, చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కోరుతున్నామని రామకృష్ణారెడ్డి జవాబిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీరు కొంచెం ముందుగా కోర్టుకు వచ్చి ఉండాల్సింది. చివరి క్షణంలో వచ్చారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను సైతం జారీ చేసింది. ఒకసారి షెడ్యూల్ విడుదలయ్యాక న్యాయస్థానాలు అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలవు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా..!’’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి రాజకీయపార్టీల గురించి ప్రస్తావించగా.. రాజ్యాంగంలో ఎక్కడా రాజకీయ పార్టీల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని, కేవలం పౌరుల ప్రస్తావన మాత్రమే ఉందని గుర్తు చేసింది.

తరువాత వాదనల్లో రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చింది. ‘‘చట్టప్రకారం ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ‘అపాయింటెడ్ డే’ రోజు నుంచి రాష్ట్రం విడిపోయినట్లు లెక్క. ఇంకా ఇది ఆంధ్రప్రదేశే. విభజన విషయంలో గెజిట్ కన్నా కూడా ‘అపాయింటెడ్ డే’ ముఖ్యం. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అంతకుముందు మున్సిపల్ ఎన్నికలను 4 వారాల్లో నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టు ముందుం చారు. దానిని పరిశీలించిన ధర్మాసనం... ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల కంటే ముందు.. ఎన్నికల నిర్వహణకు తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.

సీఎస్ వ్యవహారశైలిని కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదని ఏజీని నిలదీసింది. ఎన్నికల నిర్వహణకు గడువు కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని, దానిని హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లామని, అక్కడా పిటిషన్‌ను కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశామని ఏజీ తెలిపారు. అయినప్పటికీ ధర్మాసనం శాంతించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ఉత్తర్వులను పట్టించుకున్నట్లు కనిపించలేదంటూ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు