అకాల వర్షం.. అపార నష్టం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Published Tue, Mar 4 2014 2:53 AM

heavy losses to farmers due to untimely rains

 నిజామాబాద్ అర్బన్ , న్యూస్‌లైన్:  జిల్లాలో సోమవారం కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పలు మండలాలలో పంటలు ధ్వంసమయ్యాయి. మహా వృక్షాలు  కూకటి వేళ్లతో కూలిపోయాయి. జనజీవనానికి విఘాతం కలిగింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మొక్కజొన్న, వరి, సజ్జ, జొన్న, టమాట, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాలలో ఆరబోసిన పసుపుకొమ్ములు తడిసి ముద్దయ్యాయి. భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లిలో వడగండ్లతో, పొలాలలో పేడ ఎరువు కోసం నిలిపిన 11 ఆవు లు చనిపోయాయి. దీంతో, రైతు నారాయణ విషాదం లో మునిగిపోయాడు.

 ముచ్కూర్‌లో బస్టాండ్ సమీపంలో వందల ఏళ్ల నాటి మర్రి మహా వృక్షం పక్కనే ఉన్న రెండు కోకాలపై విరుచుకు పడింది. ఈ సమయంలో కోకాలలో ఉన్న నలుగురు వ్యక్తులకు స్వల్ప  గాయాలుకాగా ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామస్తులు వారిని హుటాహుటిన బయటకు లాగారు. త్రుటిలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కమ్మర్‌పల్లి మండలంలో  84 హెక్టార్లలో మొక్క జొన్న, 186 హెక్టార్లలో జొన్న, 117 హెక్టార్లలో నువ్వు, 422 హెక్టార్లలో సజ్జ, 125 హెక్టార్లలో వరి పంటలకు నష్ట వాటిల్లినట్లు వ్యవసాయాధికారు లు  తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో సుమారు 13వందల ఎకరాలకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.

 అంతా జలమయం
 జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ మండలాలలో దాదాపు గంటసేపు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మాక్లూర్ మండలం లో రాళ్ల వర్షం కురిసింది. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, వేల్పూరు ప్రాంతంలో వాన కలకలం సృష్టించింది. మోర్తాడ్‌లో గంటసేపు నిలకడగా వర్షం కురిసింది.

 బోధన్‌లో ట్రాన్స్‌కో అధికారులు గంటలతరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎల్లారెడ్డిలో గం టన్నర సేపు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలో రాత్రి ఏడు గంటలకు వర్షం ప్రారంభమై రెండు గంటల పాటు వర్షం కురిసింది. శివాజీనగర్‌లో చెట్లు నేలకొరిగాయి. రోడ్లన్నీ జలమయ్యామయి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలువడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement