రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు..!

22 May, 2019 04:25 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ సీఎస్‌ ఐవైఆర్‌

తప్పుడు లెక్కలు చూపి బాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది

జనచైతన్య వేదిక నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మేధావులు 

బడ్జెట్‌లో కేంద్ర నిధులు రూ.10 వేల కోట్లు వస్తాయన్నారు

అంత మొత్తంలో కేంద్ర నిధులు వచ్చే పరిస్థితులు లేవు

పన్నుల వాటాల్లో పెరిగిన మొత్తాన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చుపెట్టామంటున్నారు

వాస్తవానికి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి అయింది లేదు

2014లో రూ.85 వేల కోట్లు ఉన్న రుణం.. నేటికి 3.05 లక్షల కోట్లకు పెరిగింది

దుబారా ఖర్చుల్లో ప్రథమ స్థానంలో రాష్ట్రం 

సాక్షి, గుంటూరు: ‘నా తర్వాత ఉపద్రవం’ అని ఫ్రాన్స్‌ దేశంలో లూయీ ప్రభువు చెప్పినట్టు గత ఐదేళ్ల చంద్రబాబు పాలన ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్‌ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో ఐవైఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్‌ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు. ఇటీవల రెండు టీడీపీ అనుకూల పత్రికల్లో ‘అప్పుల అంచులో ఆంధ్రప్రదేశ్‌’ అనే కథనాలు వచ్చాయని, అది నిజం కాదని రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.

ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయం భారీగా చూపారని, రూ.10వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారని, వాస్తవానికి అంత మొత్తంలో కేంద్రం నిధులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఎప్పుడైతే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందో అప్పుడే పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను సైతం తగ్గించారన్నారు. రూ.30 వేల కోట్ల వరకూ అప్పులు చేస్తామని బడ్జెట్‌లో చూపారని, అంత మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అప్పులు ఇస్తారా అన్నది అనుమానమేనన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, కానీ ఆ అప్పు దేనికోసం చేస్తున్నామనేది ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.సి.రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.5 శాతం అభివృద్ధి రేటు ఉందంటున్నారని, అందుకు సరిపడా పన్ను వసూళ్లు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మాత్రం పెరగడం లేదన్నారు. దీనికి తోడు గత రెండేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగాయన్నారు. 

3 లక్షల కోట్లకు చేరిన రుణభారం
2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.85వేల కోట్లుగా ఉన్న రుణ భారం గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.3.05లక్షల కోట్లకు చేరిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ రుణానికి తోడు ప్రభుత్వ ఏజెన్సీలు, కార్పొరేషన్‌లు రూ.లక్ష కోట్లు అప్పుగా పొందడానికి సైతం ప్రభుత్వం గ్యారంటీగా ఉందన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కార్పొరేషన్‌లు, సంస్థలకు పీడీ అకౌంట్‌ ఉండేదని, ఆ అకౌంట్‌ ఆధారంగా ఆయా కార్పొరేషన్‌లు, సంస్థ అవసరాలు తీర్చుకోడానికి డబ్బును ఉపయోగించుకునేవారని, ఆ పీడీ అకౌంట్లలో డబ్బు లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

భారత్‌లోకెల్లా అత్యధికంగా దుబారా వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరొందిందన్నారు. కాంగ్రెస్‌ను తిట్టడానికి నవనిర్మాణ దీక్షలు, బీజేపీని తిట్టడానికి «ధర్మపోరాట దీక్షలు అని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఒక ఇల్లు, ఒక క్యాంప్‌ ఆఫీస్‌ ఉంటుందని కానీ, చంద్రబాబుకు మాత్రం నాలుగు క్యాంప్‌ ఆఫీస్‌లు ఉన్నాయన్నారు. సమాజానికి, ప్రజలకు, అభివృద్ధికి ఉపయోగపడని వాటి కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు డీఎల్‌ సుబ్రహ్మణ్యం, బాలభారతి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

టీడీపీకి కొమ్ముకాసిన మీడియా సంస్థలు
రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు నడపడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, అయితే కొన్ని మీడియా సంస్థలు టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రజలకు వాస్తవాలను చూపించడం లేదని ఆర్టీఐ మాజీ కమిషనర్‌ పి.విజయబాబు విమర్శించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని బొక్కేశారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో 25 మంది వెళ్తారని, స్పెషల్‌ ఫ్‌లైట్‌లు, స్టార్‌ హోటళ్లలో జల్సాలు చేసి డబ్బు వృథా చేశారన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అమరావతి, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో అంచనాలను అంతకంతకూ పెంచుతూ టీడీపీ నాయకులు కమీషన్‌లు బొక్కేశారని  దుయ్యబట్టారు. ఉన్న ప్రాజెక్టులను పునరుద్ధరించి, మౌలిక వసతుల కల్పనకు టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఉంటే రాష్ట్రం గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. 

మరిన్ని వార్తలు