ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత

11 Jul, 2018 08:01 IST|Sakshi
కూల్చివేసిన ఆలయం , బస్‌ షెల్టరులో ఉంచిన విగ్రహాలు

బస్‌ షెల్టర్‌లో సీత, రామ, లక్ష్మణ, హనుమ విగ్రహాలు

జాతీయ రహదారి విస్తరణలో కాంట్రాక్టరు దుర్మార్గం

శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీ య రహదారి పక్కన కూతేగానిపల్లి క్రాసు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం  అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి నేలమట్టం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న గుడిని తొలగించటంపై ఎలాంటి అభ్యంతరాలూ లేకున్నా పనులు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని బస్‌ షెల్టర్‌లో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలను సమీపంలోని ఇతర ఆలయాల్లో భద్రపరిచే అవకాశాలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా మలుపును తొలగించడంపై ఆరు నెలలుగా చర్చలు సాగుతున్నాయి. ఆలయ సమీపంలోని తమ పట్టా భూమిలో స్థలం ఇస్తానని గుడి ధర్మకర్త రమేష్‌రెడ్డి ముందుకు వచ్చారు.

రోడ్డుకు తన భూమి తీసుకోవటంతో ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు రూ.70 వేల పరిహారం కూడా ఆలయానికే ఇస్తానని అధికారుల సమక్షంలో చెప్పారు. గుడిని కూల్చే ముందుగా చిన్న పాటి గుడి నిర్మించినా దేవతామూర్తులను అందులోకి మార్చుకుని పూజలు చేస్తామన్నారు. స్థానికుల నుంచి కూడా ఇదే అభిప్రాయం రావటంతో అప్పట్లో దీనిపై కాంట్రాక్టర్ల వైపు నుంచి సానుకూ ల స్పందన వచ్చింది. ఆలయ నిర్మాణ విలువను అధికారులు దాదాపు రూ 1.70 లక్షలకు అంచనా వేశారు. ఈ ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపారు. గుడి స్థలం ప్రభుత్వానిదేనన్న సాకుతో పరిహారం మంజూరుకు సర్కారు తిరస్కరించింది. ప్రత్యామ్నాయ నిర్మాణ అం శం మరుగున పడిపోయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విగ్రహాల ను ఎదురుగా ఉన్న బస్‌ షెల్టరులోకి తరలించి, గుడిని నేలమట్టం చేశారు. దీనిపై తహసీల్దారు ప్రసాద్‌ను వివరణ కోరగా గుడిని తొలగించిన విషయం తెలియదని చెప్పారు. జాతీయ రహదారుల శాఖ జేఈ చంద్రశేఖర్‌ను సంప్రదించగా ఇతర మార్గాలు తెలియక విగ్రహాలను బస్సు షెల్టరులో పెట్టామన్నారు.

మరిన్ని వార్తలు