తెలుగు వెలుగు..గురజాడ!

29 Nov, 2014 01:49 IST|Sakshi
తెలుగు వెలుగు..గురజాడ!

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఘనత మహాకవి గురజాడ అప్పారావుకు దక్కుతుందనడంలో సందేహం లేదు. బెంగాలీలకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో తెలుగువారికి గురజాడ అంతటి గొప్ప కవి. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
 
ఒంగోలు కల్చరల్ : కవిత్వంలో మూస విధానాన్ని బద్దలు కొడుతూ ముత్యాల సరమనే కొత్త ఛందాన్ని సృష్టించి గేయ కవితలు రచించిం ది గురజాడ అప్పారావే. దేశభక్తి గేయంతో పాటు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.. కన్యక వంటి పలు కవితా ఖండికలు గురజాడ కవిత్వ ప్రతిభకు మచ్చుతునకలు. గుర జాడ సృష్టించిన వినూత్న కవిత్వ మార్గమే తనకు మార్గదర్శకమైందని స్వయంగా శ్రీశ్రీ పేర్కొనడం విశేషం.

రాళ్లురప్పలతో కూడిన ముళ్లబాటలో గురజాడ వెలుగుబాట వేస్తే ఆ మార్గాన్ని తాను మరింత వెడల్పు చేశానని, తన మహాప్రస్థానంలోని గేయాలన్నీ ఆ ప్రభావంతో రచించినవేనని శ్రీశ్రీ పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం సాహిత్యాభిమానులకు తెలిసిందే. గురజాడ అప్పారావు సమాజంలోని అంధవిశ్వాసాలను నిరసించారు. అందరూ తోక చుక్కను చూసి భయపడే రోజుల్లో భూమికి దూరపు బంధువైన తోకచుక్క అరిష్టదాయకం కాదని ధైర్యం చెప్పడమేగాక ఆ తోక చుక్కకు సాదర ఆహ్వానం పలికారు గురజాడ.
 
దురాచారంపై దూసిన ఖడ్గం కన్యాశుల్కం
గురజాడ కీర్తిని శాశ్వతం చేసిన కన్యాశుల్కం నాటకం ఒక చారిత్రక అవసరాన్ని నెరవేర్చింది. ఆనాటి సమాజంలో అమాయక స్త్రీల జీవితాలను సంక్షుభితం చేస్తున్న కన్యాశుల్క దురాచారానికి మంగళం పాడేందుకు సాహిత్యాన్ని గురజాడ వజ్రాయుధంలా సంధిం చారు. తదనంతరం కాలంలో ఆ నాటకం వల్ల కన్యాశుల్క దురాచారం తగ్గుముఖం పట్టిందని చెప్పడంలో సందేహం లేదు. సమాజానికి మేలు చేసేదే నిజమైన సాిహ త్యమనే విమర్శకుల అభిప్రాయాన్ని గురజాడ నిజమని నిరూపించారు. కన్యాశుల్కం నాటకం రచించి వందేళ్లకు పైబడినా ఆ నాటకం నేటికీ నిత్యనూతనం.

గురజాడ నిస్సందేహంగా ప్రజాకవి, మహాకవి, యుగకవి.  ప్రజల కోసం, వ్యవస్థలో నిజమైన మార్పు కోసం అక్షర సమరం సాగించిన భాషాయోధుడు. వ్యావహారికభాషగా తెలుగుకు తగిన గుర్తింపు తేవడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పోరాటశీలి. సాంఘిక సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి. గురజాడ మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం. గురజాడ రచించి న ‘దేశమును ప్రేమించుమన్న.. మంచి అన్నది పెంచుమన్న.. ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయి..! అనే దేశభక్తి గేయం ఒక్కటిచాలు ఆయన కీర్తిని అజరామరం చేసేందుకు. ఆ గేయం నేటికీ  ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ప్ర సాదిస్తూనే ఉంది. దేశమంటే ఏమిటో ప్రజలంటే ఎవరో చాటిచెబుతూ జాతిని జాగృతం చేస్తూనే ఉంది. నాటికీ నేటికీ ఒక్కటే అడుగుజాడ.. అదే గురజాడ సృష్టించిన వెలుగు జాడ!

మరిన్ని వార్తలు