విపక్షం గొంతు నొక్కి.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

6 Sep, 2014 14:06 IST|Sakshi
విపక్షం గొంతు నొక్కి.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

బీసీ తీర్మానం అంశంపై చివరిరోజు ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హడావుడిగా బీసీ తీర్మానాన్ని చేపట్టి, ఆమోదించామని అనిపించుకోవడంపై విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించి, స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.

అంతకుముందు అసలు ఎజెండాలో ఎక్కడా పెట్టకుండా ఉన్నట్టుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ తీర్మానం మీద మాట్లాడే అవకాశాన్ని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వకుండానే సభలో దీనిపై ఓటింగ్ పెట్టడానికి అధికార పక్షం ప్రయత్నించడంతో దాన్ని గట్టిగా అడ్డుకున్నారు. దీనిపై అధికారపక్షం వేర్వేరు కారణాలు చూపుతూ ఎదురుదాడి చేసింది తప్ప.. సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. బీసీ తీర్మానాన్ని ప్రవేశపెడతామని శనివారం ఉదయమే తాము స్పీకర్కు చెప్పామని యనమల అన్నారు. దాన్ని స్పీకర్ కూడా తర్వాత ఒక ప్రకటనలో సమర్థించారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీసీల మీద ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతామంటే ఎందుకంత భయపడుతున్నారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తాను లేవనెత్తే అంశాలకు సమాధానం ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సభా నియమాలను ప్రస్తావిస్తూ తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సభలో ఏ సమయంలోనైనా ప్రకటన ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. ఇది సభా సంప్రదాయమని అన్నారు. తాను విపక్ష నాయకుడిగా ఉండగా ఏరోజూ సమాచారం లేదని చెప్పారు.

దాంతో విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ స్పందించారు. ప్రకటనకు, తీర్మానానికి కూడా తేడా మర్చిపోయి ముఖ్యమంత్రి తాను తన ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారని.. తీర్మానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశపెట్టే అవకాశం లేదని వైఎస్ జగన్ గట్టిగా చెప్పారు. ప్రకటన చేయొచ్చు గానీ తీర్మానం కుదరదని, తీర్మానం అన్నప్పుడు దానిపై  చర్చ కూడా జరుగుతుందని, జరగాలని స్పష్టం చేశారు. బీసీలపై తీర్మానాన్ని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు.

ఆ సమయంలో మళ్లీ స్పీకర్ కోడెల, మంత్రి యనమల కల్పించుకుని, సభ ఆమోదించిన తీర్మానంపై మళ్లీ చర్చించడం సాధ్యం కాదన్నారు. తీర్మానాన్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతిపాదించవచ్చని యనమల అన్నారు. కావాలంటే ద్రవ్య వినియోగ బిల్లుపై మాట్లాడొచ్చని స్పీకర్ తెలిపారు.

అనంతరం విపక్షాల అభ్యంతరాల మధ్యే ద్రవ్య వినియోగబిల్లుపై మాట్లాడే అవకాశాన్ని టీడీపీ సభ్యుడు రవికుమార్కు స్పీకర్ ఇచ్చారు. ఒకవైపు విపక్ష సభ్యులు నిరసన తెలియజేస్తుండగానే బిల్లుపై చర్చ కొనసాగించే ప్రయత్నం జరిగింది. ఇది రాజ్యాంగపరంగా అత్యవసరమని, ఈ బిల్లును ఆమోదించకపోతే జీతాలు కూడా రావని యనమల అన్నారు. రాక్షసుల లక్షణాలు మీ దగ్గరే ఉన్నాయంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

దాంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ సమయంలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా బీసీలపై మాట్లాడాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ సూచించారు. అయిపోయిన ఎజెండాలోకి మళ్లీ వెళ్లలేమని తెలిపారు.

దాంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లడారు. ''కౌరవ సభలో ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ.. ఆ సభను మీరు మరిపిస్తున్నారు. న్యాయం లేదు, ధర్మం లేదు. మిమ్మల్ని చూస్తే కౌరవులు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. కౌరవులకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, వాళ్ల కంటే అన్యాయంగా ఉన్నారు. మేం చేతులు పైకెత్తినా అవకాశం ఇవ్వలేదు. తీర్మానం ఆమోదించేసినట్లు చెబుతున్నారు. మంత్రిగారికి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరదా అయిపోయింది. కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సభలో ప్రతిపక్ష నాయకుడిగా నేను ఇక్కడే కూర్చుని ఉండగానే, మాట్లాడతానంటూ చేతులు ఎత్తుతుండగానే తీర్మానం మీద చర్చ అయిపోయిందని ప్రకటించేశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా'' అన్నారు.

ఆ సమయంలో మళ్లీ అధికారపక్షం అడ్డుతగిలి, ద్రవ్య వినిమయ బిల్లు మీదే మాట్లాడాలని తెలిపారు.

అప్పుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ ''ప్రజాస్వామ్యానికి పాతర వేసినప్పుడు రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. చేతులు పైకెత్తినా అవకాశం ఇవ్వకుండా చర్చ అయిపోయిందంటున్నారు. కావాలంటే వీడియో క్లిప్స్ చూసుకోండి'' అని చెప్పారు. అయితే.. ఆ సమయంలో స్పీకర్ కోడెల కలగజేసుకుని, స్పీకర్ స్థానానికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని అన్నారు. ఈ గందరగోళం జరుగుతుండగానే ద్రవ్య వినిమయ బిల్లును హడావుడిగా ఆమోదించేసినట్లు ప్రకటించి.. సభను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినట్లయింది.

>
మరిన్ని వార్తలు