ఏపి కొత్త రాజధాని విశేషాలు!

23 Sep, 2014 18:22 IST|Sakshi
పి.నారాయణ

హైదరాబాద్: సకల సౌకర్యాలతో ఏపి రాజధాని నిర్మిస్తామని  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ  చెప్పారు. ఏపి సచివాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కొత్త రాజధానికి సంబంధించిన పలు విషయాలను చెప్పారు. భూసేకరణలో రైతులు కూడా లాభపడేవిధంగా నిబంధనలు రూపొందిస్తామన్నారు. అన్ని సౌకర్యాలతోపాటు జీవనానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేవిధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ పరిసరాలలో రాజధాని నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం కోసం  దేశంలోని పలు కొత్త రాజధానులను పరిశీలించినట్లు తెలిపారు. గాంధీనగర్, ఛండీగర్, నయారాయపూర్ నగరాలలో పర్యటించి, వాటి నిర్మాణం, అక్కడ భూసేకరణ తదితర విషయాలను అధ్యయనం చేసినట్లు వివరించారు.

గాంధీనగర్లో 5వేల 700 హెక్టార్లలో నిర్మించినట్లు తెలిపారు. గుజరాత్లో మళ్లీ  రెండువేల ఎకరాలలో నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్నిచోట్ల రైతులను నుంచి భూమిని సేకరించినట్లు తెలిపారు. సేకరించిన భూమిలో ఒక్కో చోట ఒక్కో విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఒక చోట 50 శాతం భూమి రోడ్లకు, 5 శాతం ఓపెన్ ప్లేసెస్, పది శాతం అల్పాదాయ వర్గాల కోసం కేటాయించినట్లు వివరించారు. కొన్ని చోట్ల సేకరించిన భూమిలో డెవలప్ చేసిన తరువాత 50 శాతం రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ఛండీఘర్లో 25 శాతం రోడ్లకు వదిలారని చెప్పారు. నయారాయ్పూర్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

భూసేకరణ, డెవలప్మెంట్కు సంబంధించి సమయం నిర్ణయించడం కూడా చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు ఉన్న  భూమి ధరను ఫిక్స్ చేస్తారని,  మూడు సంవత్సరాలు తరువాత డెవలప్ చేసిన భూమి మార్కెట్ విలువను లెక్కిస్తారని వివరించారు. భూమి ఇచ్చిన రైతుకు నష్టం జరుగకుండా, రైతు కూడా లాభపడే విధంగా విధివిధనాలు రూపొందించవలసి ఉంటుందని తెలిపారు.

సేకరించిన భూమిని జోన్లుగా విభజించవలసి ఉంటుందని తెలిపారు.  విద్య, వైద్యం, వ్యాపారం, నివాసం...వివిధ విభాగాలుగా విభజించాలన్నారు. కొత్తగా నిర్మించే రాజధానిలో జీవనానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించవలసి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఇతర చోట్ల రాజధానులలో జరిగిన తప్పులు ఇక్కడ జరుగకుండా చూస్తామని చెప్పారు.

నయారాయపూర్లో జీవనానికి తగిన వసతులు లేకపోవడంతో  సాయంత్ర అయ్యేసరికి అక్కడ ఎవరూ ఉండటంలేదని తెలిపారు. అలా నిర్మించి ప్రయోజనం లేదన్నారు. అందువల్ల అన్ని చోట్ల అధ్యయనం చేసి అటువంటి తప్పులు జరుగకుండా చూస్తామన్నారు.  ఇంకా మరి కొన్ని చోట్ల కూడా అధ్యయనం చేయమని చెప్పారు.
**

మరిన్ని వార్తలు