కలాంకు నివాళిగా గంట అదనంగా పనిచేయండి : చంద్రబాబు

28 Jul, 2015 19:55 IST|Sakshi
కలాంకు నివాళిగా గంట అదనంగా పనిచేయండి : చంద్రబాబు

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. తాను మరణిస్తే సెలవు ప్రకటించవద్దని, అదనంగా ఓ గంట పని చేయటమే తనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఒక గంట అదనంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విద్యాలయాల్లో ఆ గంటపాటు కలాం జీవిత చరిత్రను బోధించాల్సిందిగా సూచించారు.

మంగళవారం సచివాలయంలో జరిగిన కలాం సంతాప సభలో చంద్రబాబు ఈ సూచన చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేస్తూ కలాం ఆకస్మిక మరణం కారణంగా ఏపీ ప్రభుత్వం ఎలాంటి సెలవు దినం ప్రకటించలేదని తెలిపారు. కలాం మరణానికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు కూడా ఒక గంట అదనంగా పని చేయాలని కోరారు.

కలాం అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు

ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తమిళనాడులోని రామేశ్వరంలో జరిగే కలాం అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొంటారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది.
 

మరిన్ని వార్తలు