ఐదేళ్ల తర్వాత విముక్తి లభించింది

26 May, 2019 08:33 IST|Sakshi

ధర్మపోరాటం.. జ్ఞానభేరి అంటూ మమ్మల్ని హింస పెట్టారు..

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆనందం

సాక్షి, అమరావతి: ‘ఐదేళ్లపాటు నరకం అనుభవించాం.. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లేదు, గొంతెత్తి మాట్లాడితే సస్పెన్షన్‌లు, ఆందోళన చేద్దామని రోడ్డు మీదకొస్తే పోలీసులు తీసే వీడియోల ఆధారంగా వేతనాలు కత్తిరించడం, లేదంటే బదిలీలు చేయడం.. ఇలా అరవై నెలలు నరకం అనుభవించాం’.. ఈ మాటలన్నది స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ ఉద్యోగిని పలకరించినా తమకు విముక్తి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశామని, అయితే టీడీపీ పాలనలో తమ జీవితంలో అత్యంత చీకటి రోజులను చూశామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో కుంగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తామంతా కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నామని, తాము అనుకున్నట్టే జరగడం ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

ఇష్టం లేకపోయినా బలవంతంగా..
ప్రభుత్వ కార్యక్రమాలకు కాకుండా రాజకీయ కార్యక్రమాలకు కూడా ఉద్యోగులను వాడుకుని ఉద్యోగ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మరికొంతమంది ఉద్యోగులు చెప్పారు. ‘నవ నిర్మాణ దీక్ష అంటారు.. ఉద్యోగులను విధులు మానేసి రమ్మంటారు.. ధర్మపోరాట దీక్ష అంటారు.. ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడుకుంటారు.. జ్ఞానభేరి అంటారు.. అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు.. ఎవరైనా ఇష్టం లేదని చెప్పారంటే వారిని అంతుచూస్తామని బెదిరిస్తారు’.. ఇలా టీడీపీ పాలనలో నరకం చూశామని వాపోయారు. సీఎం హోదాలో చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలకయితే విద్యార్థులను కూడా తీసుకొచ్చి, బలవంతంగా కూర్చోబెట్టి ఎవరూ బయటకు పోకుండా తలుపులు వేసేసిన ఘటనలూ ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్, రెవెన్యూ, కాంట్రాక్టు సిబ్బందిని, ఏఎన్‌ఎంలను ఇలా ఏ ఒక్క ఉద్యోగ వర్గాన్ని వదలకుండా దారుణంగా హింసించారని పలువురు ఉద్యోగులు చెప్పారు. చివరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అడ్డుచెబితే వారు అధికారులపై చేయి చేసుకున్న సందర్భాలూ ఉన్నాయని అన్నారు.  

జగన్‌ ప్రకటనను స్వాగతిస్తే సస్పెండ్‌ చేశారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఒక ఉద్యోగిగా పేపర్‌ ప్రకటన ఇచ్చాను. దీన్ని చూసిన ప్రభుత్వం నన్ను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 4న ఉత్తర్వులిచ్చింది.  –ఆస్కారరావు, ఉద్యోగి, ప్రజారోగ్యశాఖ

ఉద్యోగులను దొంగలను చూసినట్టు చూశారు
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా అవమానించారు. ఉద్యోగుల చుట్టూ కెమెరాలు పెట్టి ఎప్పుడు ఏం చేస్తున్నారో నిఘా పెట్టి దొంగల్లాగా చూశారు. 50 ఏళ్లకు బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారన్న వార్తలు పత్రికల్లో వస్తే నన్ను అకారణంగా 15 నెలలు సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. –కె.వెంకట్రామిరెడ్డి, కన్వీనర్, ప్రభుత్వ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల సమాఖ్య

సీపీఎస్‌ రద్దు చేయాలంటే సస్పెండ్‌ చేశారు
సీపీఎస్‌ రద్దు చేయాలని అడిగితే ఈ ప్రభుత్వం నన్ను సస్పెండ్‌ చేసింది. లక్షల మంది ఉద్యోగుల తరఫున సీపీఎస్‌ రద్దు కోసం పోరాడటం నేను చేసిన తప్పా? వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతించా. ఆ మరుసటి రోజే నాకు సస్పెన్షన్‌ ఆర్డర్‌ చేతికొచ్చింది.బాబు పాలనలో ఇదీ ఉద్యోగుల పరిస్థితి. –పి.రామాంజనేయులు యాదవ్, అధ్యక్షుడు,  సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం
 

మరిన్ని వార్తలు