‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’

30 Sep, 2019 15:05 IST|Sakshi

సాక్షి, కడప : గాంధీ జయంతి సందర్భంగా ఆయన కన్న కల ‘గ్రామ స్వరాజ్యాన్ని’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. కడప ఆర్ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెత్తం 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన వెళ్లనుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో నవరత్నాల పథకాలు అమలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్‌ ఒక్కరేనని పేర్కొన్నారు.

కౌలు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని, భూ చట్టం ద్వారా రీ సర్వే చేయించనున్నామని, దీని ద్వారా భూ సమస్యలను తగ్గించడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. మానిఫేస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఉగాదికి 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

అలాగే  రాష్ట్ర చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తీసుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ నేరవేరుస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో పేజీ పేజీలు లేదని... రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చామన్నారు. మూడు నెలల లోపే 85 శాతం మానిఫెస్టోని అమలు చేసామని, జగన్‌ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియా ద్వారా దుష్పచారం చేస్తున్నారని.. బాబు అక్రమ ఇంట్లో ఉంటూ ఇప్పటి వరకు దానిపై నోరు తెరవలేదని అన్నారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని విమర్శించారు.  ఇప్పటికిప్పుడు జగన్‌ పేరు, చంద్రబాబు పేరు మీద ఓటింగ్‌ పెడితే 99 శాతం ఓట్లు జగన్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మధ్యపాలసీ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు