డీఎస్సీ.. మళ్లీ సారీ

11 Oct, 2018 09:01 IST|Sakshi
అవనిగడ్డలో కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులు

ఏళ్ల తరబడి వేచిన కనులకు మరో ‘సారీ’ చెప్పింది టీడీపీ ప్రభుత్వం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు నిరుద్యోగులను నిలువునా ముంచింది. గతంలో నాలుగుసార్లు మభ్యపెట్టిన మంత్రి గంటా తాజాగా ఈనెల 5న మరో ప్రకటన చేశారు. అందులో ఈ నెల పదో తేదిన డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, నవంబర్‌ 30న పరీక్ష, వచ్చే జనవరి 3న ఫలితాలు అంటూ ఊదరగొట్టారు. తీరా బుధవారం కూడా రిక్తహస్తమే ఎదురవడంతో డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఒక పక్క వయసు పెరిగిపోతుండడం.. మరోవైపు తడిసిమోడవుతున్న కోచింగ్‌ ఖర్చులు.. సిలబస్‌ మార్పులు వెరసి అభ్యర్థులు పూర్తిగా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగుల గుండెల్లో ఆశలు చిగురించేలా ఎప్పటికప్పుడూ ప్రకటనలు చేసింది సర్కార్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు గొప్పల కోసం చేసే ప్రకటనలు నిరుద్యోగుల పాలిట శాపంలా మారాయి. అప్పటి వరకు తాము చదివిన చదువులకు సరితూగకపోయినా ఏదో పొట్టకూటి కోసం దొరికిన ఉద్యోగం చేసుకుంటూ కాలం గడిపారు డీఎస్సీ అభ్యర్థులు. ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో టీచర్లు, పీఈటీలు, ట్యూటర్లుగా చేరి నెలకు రూ. 8 వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదించారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నామన్న ప్రకటనతో.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేశారు. తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకుని కొంతమంది. స్నేహితులు, తెలిసిన వాళ్ల వద్ద అప్పుచేసి మరి కొంతమంది కోచింగ్‌ సెంటర్లలో వాలిపోయారు. ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తీరా నోటిఫికేషన్‌లు రాకపోవడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. రోజురోజుకి అప్పులు ఎక్కువవుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళనల పెరుగుతోంది. పోనీ కోచింగ్‌ ఆపేసి తిరిగి ఏదో ఒక జాబ్‌లో చేరదామన్నా కుదరటం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తుండటం ఆశలు పెరుగుతున్నాయి. 

ఆలస్యంతో అనర్హత...
నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో వందలాది మంది నిరుద్యోగులు వయసు మీరి అనర్హులవుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితి సడలింపు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పీఈటీ పోస్టులు కృష్ణా జిల్లాలో లేవన్న వార్తతో వందలాది మంది అభ్యర్థులు శోకసద్రంలో మునిగిపోయారు. 

కోచింగ్‌ సెంటర్లకు కాసుల పంట
డీఎస్సీ నోటిఫికేషన్‌ వార్తలు వెలువడిన రోజు నుంచి కోచింగ్‌ సెంటర్లకు కాసుల పంట కురుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డలోనే 15,000 వేల మందికిపైగా కోచింగ్‌ తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కొ విద్యార్థిపైన కోచింగ్‌ ఫీజుల రూపంలోనే సరాసరి 60 నుంచి 80 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు లక్షల్లో అప్పుల పాలవుతుండగా కోచింగ్‌ సెంటర్ల వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. 

సిలబస్‌ మార్పుతో ఆందోళన
మరోవైపు డీఎస్సీ సిలబస్‌ మార్పు చేయడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ల తరబడి చదివిన చదువులు వృథాగా మారాయి. పైగా కొత్త సిలబస్‌ ప్రకారం కోచింగ్‌ అంటూ కోచింగ్‌ సెంటర్ల వారు మళ్లీ దోపిడి పర్వం మొదలుపెట్టారు. సిలబస్‌లో మార్పు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులకు గురిచేస్తోందని పలువుఉ అభ్యర్థులు వాపోయారు. 

తడిసిన మోపెడవుతున్న ఖర్చు
కోచింగ్‌ తీసుకుంటున్న వారి నెలవారీ ఖర్చుల వివరాలు

గది అద్దెకు        1,000
మెస్‌ చార్జీలు      4,000
కోచింగ్‌ ఫీజు       4,000
మెటీరియల్స్‌      2,000
ఇతర ఖర్చులు    1,000 

వెరసి నెలకు రూ. 12,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా రెండేళ్లుగా కోచింగ్‌ తీసుకుంటున్న వారికి రూ. 2,88,000లు ఖర్చు. పైగా వారు ఉద్యోగాలు మానేయడంతో సరాసరి నెలకు పదివేలు వేసుకున్నా రూ. 2.40 లక్షలు నష్టపోయారు. ఇలా ఒక్కొ అభ్యర్థి సరాసరి రూ.5 లక్షలకుపైగా కోల్పోయారు.

సిలబస్‌ మార్పు వల్ల నష్టపోతాం..
ఏడాది కాలంగా అవనిగడ్డలో కోచింగ్‌ తీసుకుంటున్నాను. ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా సిలబస్‌లో మార్పుల వల్ల ఇన్ని రోజుల మా ప్రిపరేషన్‌ వృథా అవుతుంది. 
– వై జ్యోతి, డీఎస్సీ అభ్యర్థి, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు