ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

13 May, 2019 12:28 IST|Sakshi

ఏపీ ఈసెట్‌లో 98.19 శాతం ఉత్తీర్ణత

19 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం

సాక్షి, అమరావతి:ఇంజనీరింగ్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌-2019 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్‌లు ప్రొఫెసర్‌ పి.నరసింహారావు, ప్రొఫెసర్‌ టి.కోటేశ్వరరావు, ఈసెట్‌ ఛైర్మన్‌,  అనంతపురం జేఎన్‌టీయూ వీసీ శ్రీనివాస్‌ కుమార్‌, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్‌, ప్రత్యేకాధికారి డాక్టర్‌ రఘునాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ విజయరాజు మాట్లాడుతూ ఏప్రిల్‌ 30న ఏపీ ఈసెట్‌ను నిర్వహించినట్లు వివరించారు. ఏపీ, తెలంగాణలో కలిపి 132 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు 39734 మంది దరఖాస్తు చేయగా 37749 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. వీరిలో 37066 మంది (98.19 శాతం) ఉత్తీర్ణులైనట్లు వివరించారు. పరీక్ష రూ.200 మార్కులకు నిర్వహించగా అందులో 25 శాతం అంటే 50 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణులను ప్రకటిస్తున్నామన్నారు. 

గత ఏడాదికన్నా 4వేల మంది అదనంగా ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.  మొత్తం 13 బ్రాంచులకు సంబంధించి ఈసెట్‌ను నిర్వహించామని విజయరాజు వివరించారు. గత ఏడాదిలోమిగిలిపోయిన వాటిని  కలుపుకొని మొత్తం 50774 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత సాధించిన వారు ఈనెల 19వ తేదీనుంచి  హెచ్‌టీటీపీఎస్‌://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఈసీఈటీ/‘ వెబ్‌సైట్‌ ద్వారా ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈసెట్‌లో ఆయా   బ్రాంచులో మొదటి స్థానంలో నిలిచిన ర్యాంకర్లను ఛైర్మన్‌ ప్రకటించారు.
సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే

  • బయోటెక్నాలజీ: నాగబోయిన వెంకట అప్పారావు, సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా
  • బీఎస్సీ మేథమెటిక్స్‌: కేశవరెడ్డి కాగితాల, విశాఖ
  • సిరామిక్‌ టెక్నాలజీ: చిల్లకూరు కల్యాణ్‌, చిల్లకూరు, నెల్లూరు
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌: రొంగలి నిధిష్‌, పెందుర్తి, విశాఖపట్నం
  • సివిల్‌ ఇంజనీరింగ్‌: శ్రీపెరంబదూరు ప్రణతి, హన్మకొండ, వరంగల్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌: విన్నకోట శ్రీవాణి, కాపువాడ, హన్మకొండ, వరంగల్‌
  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌: మహమ్మద్‌ ముబీన్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌జిల్లా
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌: ఖాత్రి సుజయ్‌ కుమార్‌, జాజపూర్‌, నారాయణపేట్‌, మహబూబ్‌ నగర్‌
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్స్‌ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌: వీరవల్లి సాయి సీతారాం, ఇరగవరం,  పశ్చిమగోదావరి జిల్లా
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌: తపల్‌ షేక్‌ ఇంతియాజ్‌, ముద్దనూరు, కడప
  • మెటలర్జికల్‌ఇంజనీరింగ్‌: రాయవరపు ముత్యాలనాయుడు, విశాఖపట్నం
  • మైనింగ్‌ ఇంజనీరింగ్‌: దేవునూరి సాయి వెంకటరాజ్‌, రామగుండం, పెద్దపల్లి జిల్లా
  • ఫార్మసీ: రామిశెట్టి సులోచన, సీతారామపురం నెల్లూరు
మరిన్ని వార్తలు