జీఓ398ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

1 Dec, 2014 21:09 IST|Sakshi
కెఈ కృష్ణమూర్తి

హైదరాబాద్: రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖతో లింకు పెడుతూ శుక్రవారం రాత్రి జారీ చేసిన జీఓ398ను  ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అనుమతి తప్పనిసరని శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ప్రభుత్వం జీవో నంబరు 398ను విడుదల చేసింది. తక్షణమే ఈ జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.

ముందస్తు సమాచారం లేకపోవడంతో కొత్త నిబంధనలు తెలియక శనివారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలియక తలలుపట్టుకున్నారు. వ్యవసాయ భూములు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది.
 
398 జీఓకు స్వపక్షంలోనూ వ్యతిరేకత!

ఈ నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి 398 జీఓను రద్దు చేయాలని కోరారు. ఈ జీఓకు ప్రతిపక్షాలతోపాటు స్వపక్షం నుంచి కూడా వ్యతిరేకత రావడంతో దీనిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీఓ 398ని నిలిపివేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. రైతుల మనోభావాలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ అధికారుల ధృవపత్రాలు అవసరంలేదన్నారు. ప్రస్తుత పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందని కృష్ణమూర్తి చెప్పారు.
**

మరిన్ని వార్తలు