మైనింగ్‌ మాఫియాకు మూడినట్టే..!

5 Sep, 2019 05:04 IST|Sakshi

సీబీఐ విచారణ కోరతామన్న సర్కారు నిర్ణయంపై పల్నాడులో హర్షాతిరేకాలు 

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై పల్నాడు ప్రజల్లో, యరపతినేని బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణతో గత ఐదేళ్లుగా యరపతినేని సాగించిన ఖనిజ దందా, మనీలాండరింగ్, భూమాఫియా వ్యవహారాలు బట్టబయలవుతాయని మేధావులు, అధికారులు అంటున్నారు. ‘తెల్ల సున్నపురాయి తవ్విన గోతులను కొలిస్తే ఎన్ని టన్నులు అక్రమంగా (మైనింగ్‌ లీజు, పర్మిట్లు లేకుండా) తవ్వారో తేలిపోతుంది. దీంతో ఖజానాకు ఎంత రాయల్టీ, పెనాల్టీ ఎగవేశారో బట్టబయలవుతుంది.

ఖజానాకు జరిగిన నష్టంతోపాటు అపరాధ రుసుం కూడా వసూలు చేయడానికి సీబీఐ విచారణ దోహదపడుతుంది. యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్, ప్రశ్నించినవారిపై పెట్టిన అక్రమ కేసులు, సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయట్టబయలవుతాయి. దీంతో ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని అధికారులతోపాటు టీడీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న టీడీపీ నేతలు హడలిపోతున్నారు. తమ గుట్టు రట్టు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. యరపతినేనికి సహకరించిన అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు.  

యరపతినేని కేసు పూర్వాపరాలివీ.. 
- టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 
ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు వేల టన్నుల పేలుడు పదార్థాల వినియోగం 
ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ 
అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్‌ దాఖలు చేసిన కె.గురవాచారి.. 
అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు  
అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన 11 మందిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్‌ అధికారులు 
ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కకట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యం అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త 
హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్‌ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 
గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్‌ 

నిజమైన దోషులను శిక్షించాలి 
పల్నాడులో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి కేసును సీఎం సీబీఐకి అప్పగించారు. నిజమైన దోషులను శిక్షించాలి.  దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలి. 
–కాసు మహేశ్‌ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే 
 
శుభపరిణామం
అక్రమాలు, అన్యాయం చేసినవారు చట్టానికి ఎప్పుడూ అతీతులు కారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడం శుభ పరిణామం.  
– టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా