ఇస్మార్ట్ నగరాలు

6 Oct, 2019 04:46 IST|Sakshi

మరో 13 స్మార్ట్‌ సిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాష్ట్రం

ఇప్పటికే నాలుగు సిటీలను అభివృద్ధి చేస్తున్న కేంద్రం

రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కార్యాచరణ

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పదేళ్లలో అవసరమయ్యే మొత్తం (అంచనా) 3.55 రూ. లక్షల కోట్లు  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ సిటీ కార్యక్రమానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరులతో కలిపి మొత్తం 13 పట్టణాలను ఎంపిక చేసుకుంది. వచ్చే పదేళ్లలో ఈ పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆరు పట్టణాలను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం సుమారుగా రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రంలో 17 పట్టణాలు స్మార్ట్‌గా మారనున్నాయి.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా పదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ. 3.55 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క పట్టణ రవాణా రంగంలోనే రూ. 89,034 కోట్లు అవసరమవుతాయని లెక్కకట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు, రహదారులు, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో బీవోటీ, పీపీపీ విధానాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహా్వనం పలుకుతోంది.

ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచి్చన కొరియా, ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తల బృందాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ మెట్రో రైలు, బకింగ్‌హాం కెనాల్‌ పునరుద్ధరణ, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు దేశాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర జీడీపీలో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేస్తున్నట్లు బుగ్గన పేర్కొంటున్నారు.

స్మార్ట్‌ సిటీల అభివృద్ధి ఇలా...

1రాష్ట్రం మొదటి దశలో చేపట్టేవి
 శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు

2రెండో దశలో చేపట్టేవి
విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, కడప, చిత్తూరు

కేంద్రం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్‌ సిటీలు
విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి

>
మరిన్ని వార్తలు