పీపీఏలపై అత్యున్నత కమిటీ సమీక్ష

9 Dec, 2019 12:44 IST|Sakshi

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్‌ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్‌ విద్యుత్‌, సౌర విద్యుత్‌ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్‌ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు.

పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్‌ సబ్‌కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్‌ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్‌లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్‌ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే  సీఎం జగన్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు