చేనేతలకు కొండంత అండ

25 Oct, 2019 03:41 IST|Sakshi

75,243 కుటుంబాలకు ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’

మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు 

డిసెంబర్‌లో బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ

బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయింపు 

వలంటీర్ల ద్వారా కుటుంబాల తనిఖీ 

ఇంకా ఎవరైనా అర్హులుంటే

వర్తింప చేసేందుకు చర్యలు 

మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలందరికీ వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత చేనేత జౌళి శాఖ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ప్రకారం 13 జిల్లాల్లో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలు 75,243 ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాలకు డిసెంబర్‌ నెలలో రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.180.58 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. బడ్జెట్‌లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇంకా అర్హులైన కుటుంబాలు ఉంటే వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తారు.


 

సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా..
మగ్గం ఉన్న ఒక చేనేత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దారిద్య్ర రేఖకు దిగువనున్న చేనేత కుటుంబాలే అర్హతగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, జౌళి శాఖ సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేనేత కుటుంబాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా తనిఖీలను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వలంటీర్ల తనిఖీల అనంతరం ఇంకా ఎవరైనా అర్హులుగా తేలితే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

జిల్లా కలెక్టర్లు అర్హులైన చేనేత కుటుంబాల జాబితాలను ఆమోదించాల్సి ఉంది. అర్హులైన చేనేత కుటుంబాల నిర్ధిష్ట బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలను ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్లు అందజేయాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ వాలాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన తరహాలోనే చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా నేరుగా నగదు బదిలీ చేయనున్నారు.  

మరిన్ని వార్తలు