‘మహా’నేత ఫడ్నవీస్‌

25 Oct, 2019 03:45 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు (49) అసంతృప్తి లేనప్పటికీ... పూర్తి సంతృప్తిగా లేరని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 102 స్థానాలకే పరిమితమైంది. కాకపోతే మిత్రపక్షం శివసేనతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. నాగపూర్‌ సౌత్‌వెస్టు స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌ గెలుపొందారు. మహారాష్ట్రలో రెండోసారి గెలిచిన తొలి కాంగ్రెసేతేర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. రాష్ట్రంలో పూర్తికాలం పదవిలో కొనసాగిన రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే!!.  

కలిసొచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం  
దేవేంద్ర ఫడ్నవీస్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌తో (ఆర్‌ఎస్‌ఎస్‌) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్‌ ఫడ్నవీస్‌ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్‌ ఫడ్నవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్‌ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చదివారు. 1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1992, 1997లో నాగపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్‌ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న సంబంధాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్‌ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు. అనేక సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో  క్లీన్‌ ఇమేజ్‌ దేవేంద్ర ఫడ్నవీస్‌ సొంతం. ఫడ్నవీస్‌ భార్య అమృత బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు