ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు చకచకా

4 Oct, 2019 03:53 IST|Sakshi

నాలుగేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కసరత్తు

మిగిలిన పనుల వ్యయం, ఆయకట్టు ఆధారంగా ప్రాజెక్టుల వర్గీకరణ

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం

నాబార్డు నుంచి రుణ సమీకరణ చేసి పెండింగ్‌ ప్రాజెక్టుల పనుల పూర్తికి ప్రణాళిక 

ఇప్పటికే రూ.రెండు వేల కోట్ల రుణం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నాబార్డు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. మిగిలిపోయిన పనుల వ్యయం.. ఆయకట్టు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, 2020 నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) నుంచి తక్కువ వడ్డీకి రుణ సమీకరణ చేయడం ద్వారా పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కొరత ఎదురుకాకుండా చూడాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు నాబార్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు.

రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నాబార్డు తొలి విడతగా రూ.రెండు వేల కోట్లను అక్టోబర్‌ 15లోగా సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంత నిధులు అవసరమో తెలిపితే.. నిధుల లభ్యతను బట్టి సర్దుబాటు చేస్తామని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ)కు పెండింగ్‌ ప్రాజెక్టులను బదిలీ చేసి, నాబార్డు నుంచి రుణాన్ని సమీకరించడానికి జలవనరుల శాఖ సిద్ధమైంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా తదితర నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి వాటిని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం చేపట్టారు. 2014 నాటికి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ. 80,559.98 కోట్లు వ్యయం చేశారు. 27 ప్రాజెక్టులను పూర్తిచేసి 52.05 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు.

ఒక్క ఎకరాకూ నీళ్లందించని చంద్రబాబు సర్కార్‌
జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా ప్రాజెక్టులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని జూలై 23, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 34.42 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. కానీ, ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయారు. అంచనాలను పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాను కొల్లగొట్టారు.

 పనుల్లో జాప్యం లేకుండా నిధుల విడుదల
జలయజ్ఞం ప్రాజెక్టుల పనుల్లో ఈ ఏడాది హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ తొలిదశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్, చింతలపూడి, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించారు. మిగతా ప్రాజెక్టుల పనుల్లోనూ జాప్యం చేయకుండా చూడాలని సీఎం సూచించారు. 2019–20 బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 13,139.05 కోట్లను కేటాయించారు. పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు నెలవారీగా నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు పెండింగ్‌ బిల్లులకు చెల్లింపులు చేస్తూ.. అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి.. కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు.

వర్షాలు తగ్గగానే శరవేగంగా పనులు  
జలయజ్ఞం ఫలాలను రైతులకు శరవేగంగా అందించడానికి ప్రణాళిక రచించాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులను నాలుగు విభాగాలుగా వర్గీకరించాం. వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ తొలి దశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులను 2020 నాటికి కచ్చితంగా పూర్తి చేస్తాం. పనులకు నిధుల  కోసం నాబార్డుతో చర్చలు జరిపాం. తొలి విడతగా రూ. 2 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈనెలాఖరుకు వర్షాలు తగ్గుముఖం పడతాయి. నదుల్లో వరద తగ్గుతుంది. నవంబర్‌ నుంచి ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేస్తాం.
జలవనరుల శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌

►దివంగత వైఎస్సార్‌ జలయజ్ఞం ప్రారంభ సంవత్సరం 2004

►2014 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు 27

►వ్యయం రూ. కోట్లలో 80,559.98

►సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం52.05 లక్షల ఎకరాలు

►2019–20 బడ్జెట్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం రూ. 13,139.05కోట్లు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా