ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్‌

8 Dec, 2023 18:40 IST|Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుపాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు.

‘‘ఇంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా కచ్చితంగా చెబుతున్నా. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నా’’ అని సీఎం పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
ఈ రోజు ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాలో సందర్శించాను. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది
ఈ తుపాను తిరుపతి నుంచి మొదలుపెడితే సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు
విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది
దాని వల్ల వాటర్ లాగింగ్ జరిగి ఇబ్బందులు పడ్డాం

మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ
ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకొని నడిపించి సహాయం చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది
వివక్షకు తావుండదు. నష్టం ఎవరికి జరిగినా కూడా, చివరికి మనకు ఓటు వేయని వారికి జరిగినా ఈ ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది
ట్రాన్స్‌పరెంట్‌గా నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్ ఆడిట్‌కు పేర్లు పెట్టడం జరుగుతోంది
పొరపాటు జరిగి ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలని లిస్టులు డిస్‌ప్లే చేసి మరీ సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది
ఇంతకు ముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవు
గతంలో ఏరోజు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందో తెలియదు, ఎంత మందికి వస్తుందో తెలియదు

ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పరిపాలనలో పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితి కనిపిస్తోంది
నీళ్లతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకొనేందుకు, వాళ్లకు ఇవ్వాల్సిన రేషన్ తోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు
ఇప్పటికే రేషన్, రూ.2,500 ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం పూర్తవుతుంది
దాదాపు 12 వేల మందికి, వారికి ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.2చ500 ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది
ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది.

రెండోది.. పంట నష్టానికి సంబంధించి.. ప్రతి రైతన్నకు ఒకటే చెప్పదల్చుకున్నా
ఎవరైనా మీకు ఇన్ పుట్ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే దయచేసి నమ్మవద్దండి
ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగదు అనేది గుర్తు పెట్టుకోవాలి
మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు!
పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలనే నిజం చేయాలని, అబద్ధాలనే పనిగట్టుకొని చూపించేవాళ్లు, రాసేవాళ్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం


ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు
ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు
ఈ ఖరీఫ్ సీజన్‌లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చినది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే
ఈ ఖరీఫ్ సీజన్‌కు ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? వచ్చే ఖరీఫ్ మొదలయ్యేనాటికి
జూన్‌కు రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది
ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు
అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈక్రాప్ చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా ఈ క్రాప్‌లోకి నమోదు చేసి రైతు తరఫున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే

గతంలో చంద్రబాబు పాలనలో మీకు గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లూ వరుసగా కరువు కాటకాలే
అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అంటే.. కేవలం 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు
అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో దేవుడి దయ వల్ల ఎక్కడా కరువు కాటకాలు ఏమీ లేకపోయినా కూడా రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంలో బాగుపడినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినది 55 లక్షల మందికి రూ.7,800 కోట్లు
బాబు హయాంలో ఎక్కడ 3400 కోట్లు? మీ బిడ్డ హయాంలో ఎక్కడ 7800 కోట్లు?
చంద్రబాబు ఐదు సంవత్సరాల లెక్కలు, మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల లెక్కలే చెబుతున్నా. 

ఏ సంవత్సరం అయినా ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే, వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూరెన్స్ కచ్చితంగా వస్తోంది
ఇన్ పుట్ సబ్సిడీ కూడా దేశంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్ లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం.
వెంటనే కలెక్టర్లు అందరూ స్పందిస్తున్నారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం రేపో మరునాడో మొదలు పెడతారు
కలెక్టర్లు ఎన్యుమరేషన్ పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత 15 రోజులపాటు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తారు
గ్రామ సచివాలయంలో ఎవరైనా రైతు మిస్ అయితే, మీరు పేరు చూసుకోండి.. పొరపాటున మిస్ అయి ఉంటే మళ్లీ అవకాశం ఇస్తున్నాం, మళ్లీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసి మీకు వచ్చేట్టుగా చేస్తామని సమయం ఇస్తారు

వచ్చే నెలా సంక్రాంతి లోపు మీ అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది
ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నాం
విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచి సప్లయ్ చేస్తూ వెంటనే ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం
మీ అందరితో విన్నవించేది ఒక్కటే దయచేసి అపోహలు నమ్మొద్దు
మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దండి. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దండి. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు
కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించాలి, ఆ మనిషిని తీసుకొచ్చేయాలని దురుద్దేశంతో కావాలనే అబద్ధాలాడుతున్నారు
ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని కోరుతున్నా

కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది
మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నష్టం, ఇబ్బంది జరిగినా కచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి తీసుకొచ్చాం
సోషల్ ఆడిట్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తెచ్చి, కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజేషన్ చేసి, 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి, జేసీల సంఖ్యను డబుల్ చేసి, సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం
ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ నేను రావాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు
ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా అది. 

మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు
మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత నేనే వచ్చి ప్రజలను అడుగుతా. నేనొచ్చి అడిగినప్పుడు మా కలెక్టర్ బాగా పని చేశాడు, గొప్పగా పని చేశాడనే మాట ప్రజల నుంచి రావాలి అని చెప్పాను
ఇంతకు ముందు చంద్రబాబు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. టీఆర్27కు అర్థమే చంద్రబాబుకు తెలియదు
కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి, వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సఫిషియంట్ టైమ్ ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేందుకు మీ బిడ్డ వారం తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు, ప్రజలను అడుగుతాడు అని చెప్పినప్పుడు కలెక్టర్లు, సచివాలయాలు, ఎమ్మార్వోలు, వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగెత్తి ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతోంది.

జరిగిన నష్టం అపారమైనది, కాదని నేను అనను, జరగాల్సిన, చేయాల్సిన సహాయం అంతా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. వేగంగా జరుగుతుంది
గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా జరుగుతుంది
ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా
ఇక టెంపరరీ డామేజ్‌లకు సంబంధించి, రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇటువంటి వాటికి సంబంధించి ఎలాగూ జరుగుతాయి
వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రిలీఫ్ గా చేయాల్సినవన్నీ ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాం
పర్మినెంట్‌గా రెగ్యులర్‌గా చేయాల్సిన పనులు కూడా టేకప్ చేసే కార్యక్రమాలు చేస్తాం
మీ అందరి ఆప్యాయతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా

ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు