స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు 

2 May, 2020 03:30 IST|Sakshi
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గుజరాత్‌ నుంచి శుక్రవారం అర్థరాత్రి విశాఖపట్నం చేరుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారులు

సకల సౌకర్యాలతో రాష్ట్రానికి రప్పించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి చోటా ఆహారం, పండ్లు, మజ్జిగ, తాగునీరు పంపిణీ

శుక్రవారం రాత్రికి 12 బస్సుల్లో చేరుకున్న 890 మంది

నేడు మరో 43 బస్సుల్లో రానున్న 3,178 మంది మత్స్యకారులు

సాక్షి, విశాఖపట్నం/రామవరప్పాడు(గన్నవరం)/జగ్గయ్యపేట/రాజానగరం: గుజరాత్‌లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 12 బస్సుల్లో 890 మంది రాగా.. మిగిలిన 3,178 మంది శనివారం వారి స్వగ్రామాలకు చేరుకుంటారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు.

ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తాం: మోపిదేవి
మత్స్యకారులకు శుక్రవారం విజయవాడ సమీపంలోని నిడమానూరులో మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్వాగతం పలికి అల్పాహారం, మంచినీటి బాటిళ్లను అందించారు. వారు ఇళ్లకు వెళ్లాక వారి కుటుంబ అవసరాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఆంధ్రా సరిహద్దు.. కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తదితరులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం రాజమహేంద్రవరం సమీపంలో అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ వారికి మాస్కులు అందించారు.
మత్స్యకారులకు గరికపాడు వద్ద స్వాగతం పలుకుతున్న విప్‌ ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తదితరులు   

విజయ్‌ రూపానీకి సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ వల్ల గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లను క్షేమంగా ఏపీకి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందజేసిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ చేస్తూ  భవిష్యత్తులో కూడా ఇలాగే సహకారం అందుతుందని ఆశిస్తూ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.. 
కుటుంబ పోషణ కోసం ఆరునెలల క్రితం గుజరాత్‌కి వెళ్లాను. లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లోనే చిక్కుకుపోయా. తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డా. మా కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ మేము రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. 
– చిన దానయ్య, మత్స్యకారుడు, రెల్లివీధి (విశాఖపట్నం) 

ఆంధ్రా బోర్డర్‌కు వచ్చాకే భోజనం తిన్నాం 
గుజరాత్‌లో బయలుదేరి మూడు రోజులైనా ఎక్కడా షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆంధ్రా బోర్డర్‌కి వచ్చినప్పటి నుంచి కడుపునిండా భోజనం తిన్నాం. భీమవరంలో బిర్యానీ పెట్టారు. 
 – వి. శంకర్, విజయనగరం జిల్లా   

మరిన్ని వార్తలు