పల్లె పాలన..ఇక ప్రత్యేకం

2 Aug, 2018 09:52 IST|Sakshi

నెల్లూరు(అర్బన్‌): పల్లె పాలన..ఇక ప్రత్యేకం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరన్నారు. జిల్లాలో 940 మంది సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ముందుగా ఊహించినట్టుగానే ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం జీఓ నంబర్‌ 269ను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచ్‌లు మాజీలయ్యారు. పల్లెపాలన సాగేందుకు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ తదితర క్యాడర్‌ కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిబంధనలు ఉండటంతో ఆ దిశగా కలెక్టర్, డీపీఓ చర్యలు చేపట్టారు.

బుధవారం ‘సాక్షి’లో ఇక ప్రత్యేక పాలనే అంటూ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించింది. ఈ విధివిధానాల ప్రకారమే అధికారులు పారిశుద్ధ్యం, కార్మికుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా, పైపులైను మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్లు, పబ్లిక్‌ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే జరిమానా సైతం విధించవచ్చు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ సభల తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు జరిగేవి.

ఇప్పుడు గ్రామ సభల తీర్మానాలు అవసరం లేదు. ప్రత్యేకాధికారులే అభివృద్ధి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన పర్‌ కాపిటా(తలసరి నిధులు), ఎస్‌డీఎఫ్‌ (రాష్ట్రాభివృద్ధి నిధులు) వంటి నిధులను సైతం కొన్నేళ్లుగా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చే నిధులపైనే పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోనున్నాయి. దీంతో అభివృద్ధి పనులకు నిధుల గండం పొంచి ఉంది. దీంతో అభివృద్ధి కుంటుపడనుంది. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా పంచాయతీ అ«ధికారి సత్యనారాయణను వివరణ కోరగా గురువారమే నియమిస్తామని తె లిపారు. పాలన యథావిధిగా జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు