కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? 

3 Nov, 2019 05:00 IST|Sakshi

అధికారులది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే 

ఖైదీ విడుదల కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: ఓ ఖైదీ విడుదల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయని అధికారులది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్, న్యాయశాఖ కార్యదర్శి ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యులవుతారని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గని శ్రీనివాసులు అనే ఖైదీని విడుదల చేయాలంటూ హైకోర్టు ఏప్రిల్‌ 9న ఆదేశాలు జారీ చేయగా అధికారులు అమలు చేయలేదు. దీనిపై కోర్టు ప్రశ్నించగా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపారు. తర్వాత జూన్‌ 14న విడుదల చేయాలని కోర్టు మరోసారి ఆదేశించింది. అయినా స్పందించకపోడంతో శ్రీనివాసులు సోదరుడు పవన్‌కుమార్‌ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ఆదేశాలను అమలు చేయని మీ చర్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ ఎం.రవికిరణ్‌ తదితరులను ఆదేశించారు. వారు శనివారం కోర్టు ముందు హాజరవ్వగా ధర్మాసనం విచారణ జరిపింది. అధికారుల తీరుపై మండిపడుతూ కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్‌ 14న ఆ ఖైదీ విడుదలకు ఆదేశిస్తూ జూలై 4న విడుదల చేశారని, అది కూడా కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలైన తరువాతని తెలిపింది. దీనిని ఉపేక్షించేది లేదని, తగిన ఉత్తర్వులిస్తామని తీర్పును వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు