ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై స్టే

18 Nov, 2023 05:19 IST|Sakshi

తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఫలితాలు వెల్లడించొద్దు

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా

 దేహదారుఢ్య పరీక్షలో తమకు అన్యాయం జరిగిందని పిటిషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు  

సాక్షి, అమరావతి: ఎస్‌ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెల్లడించవద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని కూడా ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.

ఎస్‌ఐ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలత­లను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యు­వల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకో­వాలని ఆరు­గొళ్లు దుర్గాప్రసాద్‌తో పాటు మరో 23 మంది హైకో­ర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అక్టోబర్‌ 20న జారీ చేసిన నోటిఫికేషన్‌ విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఓ అను­బంధ పిటిషన్‌ కూడా వేశారు. ఈ అనుబంధ పిటి­షన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ శుక్ర­వారం విచారణ జరిపా­రు.

పిటిషనర్ల తరఫు న్యా­య­వాది ఆర్‌.వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎత్తు, ఛాతి చుట్టుకొలతను కొలిచేందుకు అధికారులు డిజిటల్‌ విధానాన్ని అవలంభించడంతో కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. విచారణ జరిపిన హైకోర్టు మాన్యువల్‌ విధానంలో అభ్యర్థుల ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలవాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మాన్యువల్‌గా ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలిచారని చెప్పారు. కానీ, గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులను ఈసారి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు.

2018లో కొలిచిన వివరాలను, తాజాగా కొలిచిన వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 2018లో 169.1 సెంటీమీటర్లు ఉన్న ఎత్తు, ఇప్పుడు 167.6 సెంటీమీటర్లకు ఎలా తగ్గిందని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు.  

మరిన్ని వార్తలు