రిజర్వేషన్లు 50% మించొద్దు

3 Mar, 2020 02:55 IST|Sakshi

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని వ్యాఖ్య

59.85 శాతం రిజర్వేషన్ల జీవో 176 రద్దు చేస్తున్నాం.. ఈ జీవోకు అనుగుణంగా తీసుకున్న చర్యలన్నీ రద్దు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్‌ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది. (చదవండి: టీడీపీ.. బీసీ వ్యతిరేకి)

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 176, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 6న తీర్పును వాయిదా వేసింది. తీర్పు వెలువరించే దశలో పలు సందేహాలు రావడంతో వాటి నివృత్తి కోసం అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలను విన్న ధర్మాసనం తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.  

అసాధారణ పరిస్థితుల్లో 50 శాతం దాటొచ్చు
రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చునని ఇందిరా సహాని, రాకేష్‌ కుమార్‌ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 9 (1ఏ), 15(2), 152(1ఏ), 153(2ఏ), 180(1ఏ), 181(2)(బీ)ల గురించి ధర్మాసనం తన తీర్పులో సవివరంగా చర్చించింది. ఈ సెక్షన్ల వల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, అది చెల్లదని తీర్పులో పేర్కొంది. (చదవండి: బడుగుల ద్రోహి చంద్రబాబు)

బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని చెబుతున్న పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 9 (1ఏ) చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పునకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను నేటి నుంచి నెలలోపు తిరిగి ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మార్చి 3 కల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్‌ గురించి ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. కాగా, ఈ తీర్పుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. (చదవండి: చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..)

మరిన్ని వార్తలు