లోకేష్‌ సన్మానానికి ఉపాధి హామీ నిధులు

13 Feb, 2019 08:59 IST|Sakshi

నేడు విజయవాడకు వేలాది మంది ఉపాధి హామీ ఉద్యోగులు

మంత్రి సన్మానానికి ముందు రాజధాని ప్రాంతంలో విహారయాత్ర

రూ. 2.5 కోట్ల ఖర్చంతా ఉపాధి హామీ ఖాతాలోనే..

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ సన్మానానికి ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు సంబంధిత ఉద్యోగులందరితో బుధవారం మంత్రి లోకేష్‌కు సన్మానం జరగనుంది. ఉద్యోగులందరూ కృతజ్ఞతగా మంత్రికి సన్మానం చేస్తున్నారని పైకి చెబుతున్నా.. ఆ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించేందుకు, సన్మాన సభకు అయ్యే ఖర్చు కోసం దాదాపు రూ. 2.5కోట్లను ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించాలని మంత్రి లోకేష్‌ కార్యాలయం సూచించింది. నిజానికి ఉపాధి హామీ పథకానికి 90 శాతం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినా లోకేష్‌కు సన్మానం చేయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి ఉపాధి హామీ పథకంలో కూలీలకు డిసెంబరు నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. దాదాపు రూ.360 కోట్ల చెల్లింపుల జాప్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నిస్తే మాత్రం.. కేంద్రం నిధులు ఇవ్వలేదని అంటుంది. మరి ఈ సన్మానానికి మాత్రం నిధుల కొరత లేకపోవడం గమనార్హం. (ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?)

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మండల, జిల్లా స్థాయిలో పనిచేసే దాదాపు 15 వేల మందిని తరలించేందుకు ఉపాధి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం కాగా.. బుధవారం ఉదయమంతా వారిని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించేలా విహార యాత్రలు ఏర్పాటు చేశారు. విహార యాత్ర అనంతరం ఉద్యోగులంతా సన్మాన కార్యక్రమానికి హాజరై ‘థ్యాంక్యూ  లోకేష్‌ గారూ!’ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయాలి.

జీతాలు పెంచుతామని ఆశ పెట్టి..
లోకేష్‌ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుపై మంత్రి ప్రకటన చేస్తారని అధికారులు ఆశ పెట్టారు. కార్యక్రమానికి హాజరైతేనే జీతాలు పెరుగుతాయని చెప్పడంతో చాలామంది అయిష్టంగానే బయల్దేరారు. ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పథకంలో డిప్యూటేషన్‌పై పనిచేసే వందల మంది రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులకు రాష్ట్ర ఖజనా నుంచే కాకుండా కేంద్ర నిధుల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అక్కడ ఎలాంటి ఆర్భాటాలు ఉండకూడదని పథకం నిబంధనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మంత్రి లోకేష్‌ మాత్రం జీతాల పెంపు ప్రకటన పేరుతో రూ. రెండున్నర కోట్లను ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.     
(అయ్యో.. లోకేష్‌ అది కూడా తెలియదా?) 

మరిన్ని వార్తలు